ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) డిమాండ్ చేసింది. గురువారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ వ్యవస్థాపకుడు, కన్వీనర్ అభిజీత్ దీప్కే ఈ డిమాండ్ చేశారు. జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లోగా రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
జ్ఞానేశ్ కుమార్ రాజీనామాతో పాటు దేశంలో జరగాల్సిన అన్ని రాబోయే అసెంబ్లీ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా CJP కోరింది. అలాగే ఓటర్ల జాబితాలపై జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను 2025 నాటి ఓటర్ల జాబితా స్థితికి తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది.
CJP సహ కన్వీనర్ సౌరవ్ దాస్ తమ ప్రధాన డిమాండ్లను వెల్లడించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయడం, ఆయనపై అలాగే ఆయనకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం, రాబోయే ఎన్నికలను నిలిపివేయడం తమ డిమాండ్లలో ఉన్నాయని తెలిపారు.
అలాగే SIRకు సంబంధించిన ఫైళ్లను సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని కమిటీ సంరక్షణలో ఉంచాలని, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన ప్రస్తుత చట్టాన్ని రద్దు చేసి కొత్త వ్యవస్థను తీసుకురావాలని CJP డిమాండ్ చేసింది.
ఈ డిమాండ్లకు కారణంగా ఎన్నికల కమిషన్‌లోని అంతర్గత వ్యవహారాలపై వచ్చిన తాజా నివేదికలను CJP ప్రస్తావించింది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలు, చర్యలపై కనీసం 14 సందర్భాల్లో అభ్యంతరాలు నమోదు చేసినట్లు వెల్లడైంది.
ఇదిలా ఉండగా, జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించేందుకు ప్రతిపక్ష INDIA కూటమి కూడా పార్లమెంట్‌లో మరోసారి తీర్మానం తీసుకురావడానికి సిద్ధమవుతోంది. లోక్‌సభ, రాజ్యసభల్లో నోటీసులు ఇచ్చేందుకు ముసాయిదాను సిద్ధం చేస్తున్నట్లు ఇండియా టుడే నివేదించింది.
మరోవైపు, CJP దేశవ్యాప్తంగా “Election Commission Thik Karo” పేరుతో ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. 48 గంటల్లో జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు, ఢిల్లీలో నిరవధిక ధర్నా చేపడతామని అభిజీత్ దీప్కే తెలిపారు.
