తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో కాక్‌రొచ్ జనతా పార్టీ (CJP) కార్యకర్తల నిరసనలపై పోలీసులు తీసుకున్న చర్యలను ప్రశ్నిస్తూ, అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు దాటినా ప్రభుత్వం రాజకీయంగా తన ప్రాధాన్యతను నిలబెట్టుకోవడానికి శత్రువులను సృష్టించుకుంటోందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్టు పెట్టారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, నిరసన వ్యక్తం చేయడం పౌరుల హక్కు అని అన్నామలై పేర్కొన్నారు. నిరసనకారుల పద్ధతులతో తాను ఏకీభవించకపోయినా, వారు తమకు ముఖ్యమనిపించిన అంశాలపై ప్రశ్నించే హక్కును మాత్రం సమర్థిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వ చర్యలను ప్రశ్నించిన వారిపై విమర్శలు చేయడం, వారిని దేశద్రోహులుగా లేదా విదేశీ ఏజెంట్లుగా చిత్రీకరించడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు.
2011లో ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో అవినీతి వ్యతిరేక ఉద్యమంపై పోలీసులు చర్యలు తీసుకున్న సందర్భాన్ని అన్నామలై గుర్తుచేశారు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ, తన చేతులు కట్టివేయకపోతే ఢిల్లీకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేవాడినని వ్యాఖ్యానించిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పట్లో మోదీ చెప్పిన మాటలు సరైనవేనని అన్నామలై అన్నారు. అయితే, ప్రస్తుతం నిరసనకారులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును చూస్తే ప్రజాస్వామ్యంలో చట్టపరమైన ప్రక్రియకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నారా అనే సందేహం కలుగుతోందని పేర్కొన్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సంబంధించిన ఆంక్షలు, ముందస్తు నిర్బంధ విధానాలు, బెయిల్ ప్రక్రియలో పూచీకత్తుల తిరస్కరణ వంటి అంశాలపై అన్నామలై ప్రశ్నలు లేవనెత్తారు. CJP నిరసనకారులపై పోలీసుల చర్యలు, ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాల వినియోగం, నిరసనల సమయంలో పెల్లెట్ గన్‌ల వినియోగంపై కూడా వివరణ ఇవ్వాలని కోరారు. నిరసనలపై ప్రశ్నలు అడిగినందుకు తనపై కూడా విమర్శలు వస్తున్నాయని ఆయన అన్నారు.
అంతేకాకుండా, బీజేపీ CJPని వ్యతిరేకిస్తోందా? లేక ఆ పార్టీకి దేశవ్యాప్తంగా ఉచిత ప్రచారం కల్పిస్తోందా? అని అన్నామలై ప్రశ్నించారు. దసరా వేడుకల్లో బొద్దింక ఆకారపు దిష్టిబొమ్మను దహనం చేసిన ఘటనను ప్రస్తావిస్తూ, ఆ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే అశోక్ గోయల్ నాయకత్వం వహించారని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల CJPకి మరింత ప్రచారం లభిస్తోందని, ప్రతిపక్షాల ఓట్లను విభజించేందుకు ఆ పార్టీని పెద్ద రాజకీయ శక్తిగా చూపిస్తున్నారా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.
