కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉండటాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే 30 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. యమునా నది ప్రక్షాళనకు సంబంధించి ఢిల్లీలో రూ.8,941 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం నాలుగు రోజుల పర్యటనలో భాగంగా వియత్నాంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
“మీరు విదేశాల్లో ఎక్కడో కూర్చుని ఉన్నారు కాబట్టి నా మాటలు మీకు వినిపించకపోవచ్చు. మీరు అక్కడ ఎందుకు ఉన్నారో కూడా వివరించడం లేదు. అది మీ వ్యక్తిగత విషయం. అయితే, మీరు ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత నా మాటలు గుర్తుంచుకోండి. వచ్చే 30 ఏళ్ల వరకు మీకు అధికారం దక్కదు” అని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేస్తున్న నిరసనల నేపథ్యంలో ఆయన ఈ విమర్శలు చేశారు.
రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై బీజేపీ నేతలు కూడా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో నిరసనలు నిర్వహించిన తర్వాత రాహుల్ విదేశాలకు వెళ్లారని ఆరోపించారు. బీజేపీ నేత సాంబిత్ పాత్రా, రాహుల్ గాంధీ విదేశీ సంస్థలతో సంబంధాలపై ఆరోపణలు చేయగా, పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కూడా ఆయన పర్యటన ఉద్దేశంపై ప్రశ్నలు లేవనెత్తారు. అయితే, రాహుల్ గాంధీ తన వ్యక్తిగత సమయాన్ని ఎలా వినియోగించుకోవాలనేది ఆయన ఇష్టమని కాంగ్రెస్ వర్గాలు స్పందించాయి.
ఎన్నికల్లో ఓటు చోరీ జరుగుతోందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను కూడా అమిత్ షా తప్పుబట్టారు. కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితాలు బాగున్నాయని చెబుతూ, ఓడిపోయిన చోట్ల మాత్రం ఎన్నికల వ్యవస్థపై విమర్శలు చేస్తోందని ఆరోపించారు. కేరళ, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేదా దాని మిత్రపక్షాలు గెలిచినప్పుడు ఎన్నికల సంఘంపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్య సంస్థలను అంగీకరించడం సరైన విధానం కాదని విమర్శించారు.
పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ 54 ఏళ్లుగా ఎన్నికల్లో గెలవలేకపోయిందని, అరుణాచల్ ప్రదేశ్‌లో 12 ఏళ్లుగా, ఢిల్లీలో 18 ఏళ్లుగా అధికారంలోకి రాలేదని అమిత్ షా పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించుకోవాలని ప్రతిపక్షానికి సూచించారు. ఆరు నెలలకోసారి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం తనకు లేదని, తాను భారతదేశంలోనే పుట్టి, ఇక్కడే జీవిస్తూ, ఇక్కడే మరణిస్తానని వ్యాఖ్యానిస్తూ రాహుల్ గాంధీని పరోక్షంగా విమర్శించారు.
