ఢిల్లీ సత్య నికేతన్‌లో సెప్టెంబర్ 6న కూలిపోయిన పీజీ భవనం ఘటనపై ఢిల్లీ పోలీసులు కీలక వివరాలను ఢిల్లీ హైకోర్టుకు సమర్పించారు. నిర్మాణం, మరమ్మతులు, భవనం మార్పులు చేపట్టే సమయంలో తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదకర పరిస్థితి ఏర్పడి ఏడుగురు మృతి చెందారని, పలువురు గాయపడ్డారని పోలీసులు తమ స్టేటస్‌ రిపోర్టులో పేర్కొన్నారు. మృతుల్లో ఐదుగురు విద్యార్థులు ఉన్నారు.

ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌కు సమీపంలోని సత్య నికేతన్‌లో ఈ ఐదు అంతస్తుల భవనంలో బాలుర కోసం పేయింగ్ గెస్ట్ (PG) వసతి కొనసాగుతోంది. సుమారు 50 ఏళ్ల పాత భవనంలో మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో సెప్టెంబర్ 6న మధ్యాహ్నం భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.

సెప్టెంబర్ 21న ఢిల్లీ పోలీసులు ఎనిమిది పేజీల స్టేటస్ రిపోర్టును హైకోర్టులో దాఖలు చేశారు. భవనంపై అధిక నిర్మాణ భారం పడటం లేదా ఇప్పటికే ఉన్న నిర్మాణం బలహీనపడటం వల్లే కూలిపోయి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. అలాగే పాత భవనంలో అనుమతులు లేకుండా బేస్‌మెంట్‌, పై అంతస్తుల్లో అదనపు నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించామని పేర్కొన్నారు.

భవనం యజమాని ఉర్మిలా గుప్తా, ఆమె భర్త హరి రామ్ గుప్తా, కుమారుడు మహేశ్ గుప్తా కలిసి ఆస్తిని నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. భవనాన్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగించేందుకు అవసరమైన ల్యాండ్‌-యూజ్‌ మార్పిడి అనుమతి తీసుకోలేదని, అలాగే నిర్మాణ మార్పులు, బేస్‌మెంట్‌ మరమ్మతుల సమయంలో అర్హత కలిగిన స్ట్రక్చరల్ ఇంజనీర్ లేదా ఆర్కిటెక్ట్‌ సలహా తీసుకోలేదని నివేదికలో పేర్కొన్నారు.

ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో భవన యజమాని కుటుంబ సభ్యులతో పాటు అక్కడ ‘హాస్టల్ డేజ్’ పేరుతో బాలుర పీజీ నిర్వహిస్తున్న శుభమ్ త్యాగి, సుధాన్షు లోవెనిష్ కుమార్, అలాగే నిర్మాణం, మరమ్మతు పనులకు కాంట్రాక్టర్‌గా ఉన్న సనోజ్ ఉన్నారు.

కాంట్రాక్టర్ సనోజ్ ఇద్దరు అర్హత లేని కార్మికులను మరమ్మతు, నిర్మాణ మార్పుల పనులకు ఉపయోగించినట్లు పోలీసులు ఆరోపించారు. పనులు ప్రారంభించే ముందు యజమానులు గానీ, కాంట్రాక్టర్ గానీ అర్హత కలిగిన ఆర్కిటెక్ట్ లేదా స్ట్రక్చరల్ నిపుణుడి సలహా తీసుకోలేదని తెలిపారు. దీంతో నిర్మాణ భద్రతపై తీవ్ర నిర్లక్ష్యం జరిగినట్లు పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు.

ఈ ఘటనపై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. బాధిత విద్యార్థులకు తక్షణ వైద్య సహాయం, పునరావాసం, మృతుల కుటుంబాలకు పరిహారం, ప్రమాదానికి సంబంధించిన కీలక ఆధారాలను భద్రపరచాలని పిటిషన్‌లో కోరారు. సెప్టెంబర్ 7న హైకోర్టు భవనం కూలిన ఘటనపై ఉన్నతస్థాయి MCD విచారణకు ఆదేశించింది.

సత్య నికేతన్ ఘటన తర్వాత ఢిల్లీలోని పీజీ భవనాల భద్రతపై కూడా దృష్టి పెరిగింది. ఢిల్లీ ప్రభుత్వం పీజీ వసతుల నిర్మాణ భద్రతను పరిశీలించేందుకు ఆడిట్లు, తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ముఖ్యంగా విద్యార్థులు అధికంగా నివసించే ప్రాంతాల్లో భవనాల భద్రత, ఫైర్ సేఫ్టీ, నిర్మాణ అనుమతులపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.

#Building Collapse Case, #Delhi Building Collapse, #Delhi PG Building, #Delhi Police, #Delhi Satya Niketan, #Satya Niketan Building Collapse, #Satya Niketan PG