భారత్‌లో దేశీయ పర్యాటకానికి భక్తి, ఆధ్యాత్మిక ప్రయాణాలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. దేశంలో జరిగే మొత్తం రాత్రి బసతో కూడిన దేశీయ ప్రయాణాల్లో దాదాపు 48 శాతం యాత్రలు తీర్థయాత్రలు, మతపరమైన ప్రయాణాల కోసమే జరుగుతున్నట్లు తాజా ప్రభుత్వ సర్వే వెల్లడించింది. దీంతో సాధారణ హాలిడే ట్రిప్‌ల కంటే మతపరమైన యాత్రలే భారతీయుల దేశీయ ప్రయాణాల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) విడుదల చేసిన తాజా డొమెస్టిక్ టూరిజం ఎక్స్పెండిచర్ సర్వే (DTES)లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) ఆధ్వర్యంలో 2025 జూలై నుంచి 2026 జూన్ వరకు ఈ సర్వే నిర్వహించారు. ప్రజలు దేశంలో ఎందుకు ప్రయాణిస్తున్నారు, ఎంతకాలం ఉంటున్నారు, ఏ రవాణా మార్గాలను ఉపయోగిస్తున్నారు, ఎక్కడ బస చేస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు వంటి అంశాలను సర్వేలో పరిశీలించారు.
రాత్రి బసతో కూడిన దేశీయ ప్రయాణాల్లో తీర్థయాత్రలు, మతపరమైన ప్రయాణాలు 48 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే ప్రధాన ప్రయాణ కారణంగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, వైద్య అవసరాల కోసం చేసే ప్రయాణాలు 38.4 శాతంతో రెండో స్థానంలో ఉండగా, పట్టణ ప్రాంతాల్లో సెలవులు, వినోదం, విహారయాత్రలు 36.4 శాతంతో రెండో స్థానంలో ఉన్నాయి.
అయితే భారతీయుల దేశీయ ప్రయాణాలు ఎక్కువ రోజులు సాగడం లేదని సర్వే వెల్లడించింది. సగటు ట్రిప్‌లో రాత్రి బస చేసే ప్రయాణికుల సంఖ్య 2.03గా ఉంది. దాదాపు 80 శాతం మంది ప్రయాణికులు ఐదు రోజులు లేదా అంతకంటే తక్కువ సమయంలోనే తమ ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు సర్వే తెలిపింది.
ప్రయాణానికి ఉపయోగించే రవాణా విషయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య తేడా కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు అత్యధికంగా ఉపయోగించే రవాణా మార్గంగా ఉన్నాయి. మొత్తం ప్రయాణాల్లో బస్సుల వాటా 32 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో రైళ్లు 35 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉన్నాయి. అంటే దేశీయ ప్రయాణాల్లో ఇప్పటికీ రోడ్డు, రైలు రవాణా కీలక పాత్ర పోషిస్తున్నాయి.
దేశంలో ఏ రాష్ట్రానికి ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్తున్నారనే విషయంలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే వారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని కలిపి చూస్తే మొత్తం విజిటర్ ట్రిప్స్‌లో ఉత్తరప్రదేశ్ వాటా 15.7 శాతంగా ఉంది. తమిళనాడు 13.4 శాతంతో రెండో స్థానంలో, రాజస్థాన్ 8 శాతంతో తర్వాతి స్థానంలో ఉన్నాయి.
ఈ సర్వే కోసం దేశవ్యాప్తంగా 2,46,113 కుటుంబాల నుంచి సమాచారం సేకరించారు. ఇందులో 1,42,603 గ్రామీణ కుటుంబాలు, 1,03,510 పట్టణ కుటుంబాలు ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తే భారతదేశంలో దేశీయ పర్యాటకం కేవలం హాలిడేలు, వినోద యాత్రలకే పరిమితం కాకుండా.. భక్తి, వైద్యం, కుటుంబ సంబంధాలు, సామాజిక అవసరాలతో కూడా బలంగా అనుసంధానమై ఉందని అర్థమవుతోంది.
