ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఖర్చులను నియంత్రించేందుకు ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని విస్తరించింది. ఇందులో భాగంగా ఐదు దేశాల్లోని కొన్ని విభాగాల ఉద్యోగులకు కంపెనీ నుంచి స్వచ్ఛందంగా వైదొలగే అవకాశం కల్పిస్తోంది. ఉద్యోగాన్ని వదిలి వెళ్లేందుకు అంగీకరించే వారికి సేవరెన్స్ ప్యాకేజీ (పరిహార ప్యాకేజీ) అందించనుంది.

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్ దేశాల్లోని ఉద్యోగులకు ఈ ఆఫర్‌ను గూగుల్ అందిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ఈ పథకాన్ని ఆయా దేశాలకు విస్తరించింది. అయితే ఇప్పటివరకు ఎంతమంది ఉద్యోగులు ఈ ఆఫర్‌ను అంగీకరించారనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. 2025లోనే కొన్ని విభాగాల్లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని ప్రారంభించామని, అనంతరం మరిన్ని దేశాలకు విస్తరించామని గూగుల్ ప్రతినిధి తెలిపారు.

అయితే గూగుల్‌లోని అన్ని విభాగాల ఉద్యోగులకు ఈ అవకాశం వర్తించదు. కంపెనీకి చెందిన ఏఐ పరిశోధన విభాగం డీప్‌మైండ్ (DeepMind), గూగుల్ క్లౌడ్ (Google Cloud) ఉద్యోగులకు ఈ పథకం వర్తించడం లేదు. ఈ రెండు విభాగాలు కంపెనీ భవిష్యత్తు వ్యూహాల్లో కీలకమైనవిగా ఉండటంతో అక్కడ మరింత మంది ఉద్యోగులను నియమించుకోవాలని గూగుల్ భావిస్తోంది. మరోవైపు కొన్ని ఇతర విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం లేదా పునర్వ్యవస్థీకరించడం ద్వారా ఖర్చులను నియంత్రించాలని చూస్తోంది.

గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఏఐ సాంకేతికత అభివృద్ధి, డేటా సెంటర్లు, కంప్యూటింగ్ సామర్థ్యాల కోసం భారీగా ఖర్చు చేస్తోంది. ఈ పెట్టుబడుల నేపథ్యంలో నిర్వహణ ఖర్చులను కూడా అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందులో భాగంగానే కొన్ని విభాగాల్లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలుస్తోంది. స్విట్జర్లాండ్‌లోని గూగుల్ ఉద్యోగులకు జూన్‌లో ఈ ఆఫర్ అందించగా, అంగీకరించిన వారు ఆగస్టు నుంచి ఉద్యోగాలను వీడటం ప్రారంభించారు. అక్కడ సుమారు 5,000 మంది గూగుల్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ పథకం కింద ప్రతి ఏడాది సర్వీసుకు ఒక నెల జీతం చొప్పున, గరిష్ఠంగా 12 నెలల జీతాన్ని పరిహారంగా అందించినట్లు సమాచారం. ఒక విభాగంలోని సుమారు 50 మంది ఉద్యోగుల్లో కనీసం నలుగురు ఈ ఆఫర్‌ను అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా ఉద్యోగులకు స్వచ్ఛంద బైఔట్ ఆఫర్ ప్రకటించింది. అమెరికా, కెనడా, భారత్, బ్రిటన్ దేశాల్లోని సుమారు 60 వేల మంది ఉద్యోగులకు ఈ అవకాశం వర్తించేలా పథకాన్ని రూపొందించింది. మైక్రోసాఫ్ట్‌లోని 70వ స్థాయి లేదా అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న అర్హులైన ఉద్యోగులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. కంపెనీలోని మొత్తం 2.23 లక్షల మంది ఉద్యోగుల్లో సుమారు 27 శాతం మందికి ఈ పథకం వర్తించవచ్చని అంచనా. ఈ ఆఫర్‌ను అంగీకరించిన ఉద్యోగులు డిసెంబర్ చివరి నాటికి సంస్థ నుంచి వైదొలగనున్నారు.

#Google, #Google AI Investments, #Google Employees, #Google Layoffs, #Google Severance Package, #Google Voluntary Exit Offer, #Microsoft Buyout Offer