యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్‌ను చూసి నకిలీ కరెన్సీ తయారు చేయడం నేర్చుకున్న ఓ వ్యక్తి.. ఏకంగా భారీ నకిలీ నోట్ల ముఠాను నడిపించాడు. హైదరాబాద్ శివారులో అద్దె ఇంట్లో నకిలీ నోట్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఈ ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేసి, రూ.6.78 కోట్ల విలువైన నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.
నవంబర్ 1న జాతీయ రహదారి 65పై రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, షాద్‌నగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న కారును అడ్డగించి తనిఖీ చేయగా, అందులో రూ.8 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లు లభించాయి. కారులో ఉన్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, హైదరాబాద్ శివారులోని కుంట్లూరులో అద్దె ఇంట్లో నకిలీ కరెన్సీ తయారీ కేంద్రం నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.
పోలీసులు కుంట్లూరులోని ఆ ఇంటిపై దాడి చేసి మరో 134 కట్టల నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి ముఖ విలువ సుమారు రూ.6.70 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. దీంతో వాహనంలో దొరికిన రూ.8 లక్షల నకిలీ నోట్లతో కలిపి మొత్తం రూ.6.78 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ పట్టుబడింది. నోట్ల తయారీకి ఉపయోగిస్తున్న కలర్ ప్రింటర్లు, స్కానర్లు, ల్యాప్‌టాప్, లామినేషన్ యంత్రం, నోట్లను కత్తిరించే పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ముఠాలో ప్రధాన నిందితుడిగా గుర్తించిన మడుపోజు కర్ణాకర్ యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్ ద్వారా నకిలీ కరెన్సీ తయారీ గురించి నేర్చుకున్నాడు. అసలైన రూ.500 నోట్లను స్కాన్ చేసి, ఫోటోషాప్ వంటి ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌తో వాటి చిత్రాలను మార్చి నకిలీ నోట్లను ముద్రించినట్లు దర్యాప్తులో తేలింది. మొదట ప్రతి లక్ష రూపాయల అసలు నగదుకు బదులుగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు నకిలీ నోట్లు ఇస్తామని ఆశ చూపించి వాటిని చలామణిలోకి తీసుకురావాలని ప్రయత్నించారు.
నకిలీ నోట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిన వ్యక్తుల వద్దకు ముందుగా వెళ్లి అసలైన కరెన్సీని చూపించి నమ్మకం కలిగించేవారు. ఆ తర్వాత ముఠాలోని మరికొందరు నకిలీ పోలీసు గుర్తింపు కార్డులు, వాకీటాకీలు, నకిలీ పిస్టళ్లతో పోలీసులుగా వచ్చేవారు. నకిలీ నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలను ఉపయోగించి కొనుగోలుదారులను బెదిరించి, వారి వద్ద ఉన్న అసలైన డబ్బుతో పారిపోయేవారు. ఈ విధంగా ఇద్దరు వ్యక్తుల నుంచి వేర్వేరు ఘటనల్లో రూ.2 లక్షలు, రూ.3 లక్షలు దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో మడుపోజు కర్ణాకర్, చిన్నొల్ల మాణిక్య రెడ్డి, చెరుకుపెల్లి రత్నాకర్ రెడ్డి, కరణం అజయ్ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం గాలింపు చేపట్టారు. హైదరాబాద్ శివారులో నకిలీ కరెన్సీ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తూ, పోలీసుల వేషంలో ప్రజలను మోసం చేసిన ఈ ముఠా వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ నకిలీ నోట్ల తయారీ, చలామణి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇతర ప్రాంతాలకు కూడా ఈ ముఠా కార్యకలాపాలు విస్తరించాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
