రైలులో ప్రయాణికులకు భద్రత కరువైందంటూ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఫస్ట్ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో తన నగలు, నగదు చోరీకి గురయ్యాయని కన్నీళ్లు పెట్టుకుంది. తాళం వేసి ఉన్న ఏసీ క్యాబిన్లోకి కూడా దొంగలు ఎలా ప్రవేశించారంటూ ప్రశ్నించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆనంద్ విహార్ టెర్మినల్ – న్యూ జల్పాయిగురి ఎక్స్‌ప్రెస్‌లోని ఫస్ట్ ఏసీ కోచ్‌లో ఆ మహిళ ప్రయాణిస్తోంది. లక్నో రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి తన క్యాబిన్లోకి ప్రవేశించి వస్తువులను దొంగిలించాడని ఆమె ఆరోపించింది. సుమారు రూ.2.5 లక్షల విలువైన నగలతో పాటు రూ.25 వేల నగదును దుండగుడు ఎత్తుకెళ్లినట్లు తెలిపింది.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో మహిళ కన్నీళ్లు పెట్టుకుంటూ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించింది. ఫస్ట్ ఏసీలో ప్రయాణిస్తున్నా భద్రత లేకపోతే సాధారణ ప్రయాణికుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. తన బిడ్డను కూడా ఎవరైనా అపహరించి ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదోనని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, తన బిడ్డ క్షేమంగా ఉండటం ఒక్కటే ఊరటనిచ్చిందని చెప్పింది.
దొంగతనం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ చైన్‌ను నాలుగుసార్లు లాగినట్లు మహిళ తెలిపింది. అయినప్పటికీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది లేదా ఇతర రైల్వే అధికారులు తనకు సహాయం చేసేందుకు రాలేదని ఆరోపించింది. తన మొరను ఎవరూ పట్టించుకోలేదని, ఫస్ట్ ఏసీ వంటి సురక్షితమైన ప్రయాణ సదుపాయంలో కూడా ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘జెమ్స్ ఆఫ్ రైల్వేస్’ అనే ఎక్స్ ఖాతా షేర్ చేసింది. నవంబర్ 2న ఈ వీడియోను పోస్ట్ చేయగా, రైలులో ప్రయాణికుల భద్రతపై పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. తాళం వేసిన క్యాబిన్లోకి దొంగలు ఎలా ప్రవేశించారో, అత్యవసర సమయంలో సిబ్బంది ఎందుకు స్పందించలేదో విచారించాలని డిమాండ్ చేశారు.
