మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) అధినేత రాజ్ ఠాక్రే ఒకే వేదికపై కనిపించారు. ముంబైలో జరిగిన మరాఠీ కార్టూన్ల పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముగ్గురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు సరదాగా రాజకీయ వ్యాఖ్యలు చేసుకుంటూ నవ్వులు పూయించారు.

మరాఠీ రాజకీయ కార్టూన్ల చరిత్రను వివరించే ‘మహారాష్ట్రచ్యా హాస్యరేషా’ అనే పుస్తకాన్ని ప్రముఖ కార్టూనిస్ట్, రాజకీయ వ్యంగ్య రచయిత ప్రశాంత్ కులకర్ణి రూపొందించారు. ముంబైలోని దాదర్‌లో ఉన్న స్వాతంత్ర్యవీర్ సావర్కర్ రాష్ట్రీయ స్మారక్ ఆడిటోరియంలో ఈ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేతో పాటు మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఆశిష్ షెలార్ పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడిన ఫడ్నవీస్ తనపై గతంలో కార్టూన్లు గీసిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. ఒకసారి రాజ్ ఠాక్రేను కలిసినప్పుడు తన కార్టూన్ గీస్తే ముక్కు లేదా చెవులు పెద్దగా చూపించినా పర్వాలేదని, కానీ పొట్టను మాత్రం పెద్దగా చూపించవద్దని కోరినట్లు చెప్పారు. రాజ్ ఠాక్రే తన మాటను అర్థం చేసుకున్నారని, అప్పటి నుంచి తన పొట్టను పెద్దగా చూపిస్తూ కార్టూన్లు గీయడం తగ్గించారని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే, ఇతర కార్టూనిస్టులు మాత్రం తన పొట్టను పెద్దగా చూపిస్తూనే ఉన్నారని అన్నారు. తాను కూడా పొట్ట తగ్గించుకోవడానికి ప్రయత్నించానని నవ్వుతూ చెప్పారు.

అనంతరం ఉద్ధవ్ ఠాక్రేతో తనకున్న గత సంబంధాలను ఫడ్నవీస్ గుర్తుచేసుకున్నారు. 2019కు ముందు ఉద్ధవ్ ఠాక్రే ఎప్పుడు ఫోన్ చేసినా తాను వెళ్లి కలిసేవాడినని చెప్పారు. 2019 తర్వాత కూడా ఆయన ఫోన్ చేస్తారని ఎదురుచూశానని, కానీ ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదని సరదాగా వ్యాఖ్యానించారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ, అప్పటి అవిభక్త శివసేన మధ్య విభేదాలు ఏర్పడి రెండు పార్టీలు విడిపోయిన విషయం తెలిసిందే.

రాజ్ ఠాక్రే కార్టూన్లు గీయడంలో మంచి ప్రతిభ కలిగిన వ్యక్తి అని, ఉద్ధవ్ ఠాక్రే మంచి ఫొటోగ్రాఫర్ అని ఫడ్నవీస్ ప్రశంసించారు. “రాజ్ మంచి కార్టూనిస్ట్.. ఉద్ధవ్ మంచి ఫొటోగ్రాఫర్. వాళ్లు తమ ప్రతిభను కొనసాగించాలి. నాకు రాజకీయాలు తప్ప మరేమీ తెలియదు. కాబట్టి రాజకీయాలు నన్ను చేసుకోనివ్వండి” అంటూ చమత్కరించారు. ఈ వ్యాఖ్యలకు సభలో ఉన్నవారు నవ్వులతో స్పందించారు.

ఫడ్నవీస్ వ్యాఖ్యలకు ఉద్ధవ్ ఠాక్రే కూడా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఒక వ్యక్తి ఒక్క పనిలోనే ప్రతిభ చూపించాలనే నియమం లేదని అన్నారు. కార్టూనిస్టుల చేతిలో కుంచె ఒక ఆయుధం లాంటిదని, శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే తన కార్టూన్ల ద్వారా ఆ విషయాన్ని నిరూపించారని గుర్తుచేశారు. కార్టూన్లు కూడా రాజకీయంగా బలమైన సందేశాన్ని ఇవ్వగలవని ఆయన వ్యాఖ్యానించారు.

#Bal Thackeray, #Cartoon Book Launch, #Devendra Fadnavis, #Maharashtra CM, #Maharashtra Politics, #Marathi Cartoon, #Political Satire, #Raj Thackeray, #Uddhav Thackeray