తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ (93) కన్నుమూశారు. అక్టోబర్ 30, శుక్రవారం చెన్నైలో ఆమె తుదిశ్వాస విడిచారు. వయోభారంతో పాటు వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా ఆమె మరణించినట్లు తమిళ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆమె భౌతికకాయాన్ని చెన్నైలోని పల్లావరం నివాసంలో అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. ఆమె మృతితో తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
వత్సలా రాజగోపాల్ 1933 డిసెంబర్ 25న కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే నృత్యం, నాటకాలపై ఆసక్తి ఉండేది. వివాహం అనంతరం 1953లో చెన్నైకి వచ్చారు. అక్కడ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేశారు. అదే కార్యాలయంలో ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ కూడా సీనియర్ అధికారిగా పనిచేసేవారు. ఆ తర్వాత కార్టూనిస్ట్ శ్రీధరన్ నిర్వహించే ‘రసిక రంగ’ అనే నాటక బృందంలో చేరి రంగస్థల నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు.
1979లో నాటకరంగంలో అడుగుపెట్టిన వత్సలా రాజగోపాల్ దాదాపు 25 ఏళ్ల పాటు రంగస్థలంపై నటించారు. ఈ కాలంలో సుమారు 450 నాటకాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆమె నటనకు మంచి గుర్తింపు రావడంతో సినీ దర్శకుల దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆమెకు సినిమా అవకాశం కల్పించారు.
1992లో విడుదలైన మణిరత్నం దర్శకత్వంలోని ‘రోజా’ సినిమాతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. అరవింద్ స్వామి, మధుబాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో మధుబాల నానమ్మ పాత్రను వత్సలా పోషించారు. అప్పటికి ఆమె వయసు సుమారు 60 సంవత్సరాలు. జీవితంలో ఆలస్యంగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ, తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
ఆ తర్వాత ‘సతి లీలావతి’, ‘అన్నియన్’, ‘రిథమ్’, ‘విన్నర్’, ‘పట్టియల్’, ‘ధామ్ ధూమ్’, ‘మొళి’, ‘కల్యాణ సమయల్ సాధం’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ‘సతి లీలావతి’ సినిమాలో అంబుజం మామి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఎక్కువగా ప్రేమను పంచే బామ్మ పాత్రల్లో కనిపించినప్పటికీ, తన హాస్యంతోనూ ప్రేక్షకులను నవ్వించారు.
సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలోనూ వత్సలా రాజగోపాల్ మంచి గుర్తింపు పొందారు. ‘చిత్తి’, ‘ఆనందం’, ‘ముందానై ముడిచు’, ‘వసంతం’ వంటి ప్రముఖ తమిళ సీరియళ్లలో నటించారు. దర్శకుడు బాలు మహేంద్ర రూపొందించిన ‘కథై నేరం’ టెలివిజన్ సంకలనంలోనూ భాగమయ్యారు. రంగస్థలం, సినిమాలు, టెలివిజన్ ఇలా మూడు రంగాల్లోనూ తనదైన ముద్ర వేశారు.
