ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో హైజాక్ ప్రయత్నాన్ని అడ్డుకుని 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఘనంగా సత్కారం చేసింది. అయితే, ఈ కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆయన తల వెనుక భాగంలో కనిపించిన పెద్ద కుట్ల వరుస. సహ పైలట్ దాడిలో ఆయన ఎంత తీవ్రంగా గాయపడ్డారో ఈ కుట్లు తెలియజేశాయి. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వయంగా ఆయన గాయాలను పరిశీలించడం, ఆ తర్వాత ఇద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్‌కు చెందిన ఎఫ్‌జెడ్ 1073 విమానం దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు ప్రయాణిస్తోంది. విమానం ఇజ్రాయెల్ గగనతలంలోకి ప్రవేశించబోతున్న సమయంలో, ఒమన్‌కు చెందిన సహ పైలట్ హమామ్ అల్ హమ్మామి కాక్‌పిట్‌లో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై వెనుక నుంచి క్రాష్ యాక్స్‌తో దాడి చేసినట్లు కథనం తెలిపింది. విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ, టెల్ అవీవ్‌లోని ఎత్తైన భవనాన్ని ఢీకొట్టేలా చేయాలనే ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
తీవ్రంగా గాయపడినప్పటికీ స్మిత్ మచ్చర్ ధైర్యం కోల్పోలేదు. తలకు తీవ్ర గాయం కావడంతో రక్తస్రావం జరుగుతున్నా, కాక్‌పిట్ తలుపును తెరవగలిగారు. దీంతో ఇతర సిబ్బంది, ప్రయాణికులు లోపలికి చేరుకుని దాడి చేసిన సహ పైలట్‌ను అదుపులోకి తీసుకునేందుకు సహకరించారు. ఈ గందరగోళంలో విమానం కేవలం రెండు నిమిషాల్లో 17,000 అడుగులకు పైగా కిందికి పడిపోయినట్లు నివేదిక పేర్కొంది. అదే విమానంలో ప్రయాణిస్తున్న విధుల్లో లేని ఇద్దరు పైలట్లు విమానాన్ని తిరిగి స్థిరీకరించడంలో సహకరించారు.
ఈ దాడిలో స్మిత్ మచ్చర్ తలకు తీవ్ర గాయమై, పుర్రె ఎముక విరిగింది. చేతికి కూడా గాయాలయ్యాయి. పుర్రె ఎముకలో విరిగిన భాగం లోపలికి నెట్టుకుపోయే ప్రమాదకరమైన గాయం కావడంతో ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అవసరమైంది. సౌదీ అరేబియాలో వైద్యులు ఆయనకు తొలుత చికిత్స అందించి, పుర్రెకు పునర్నిర్మాణ శస్త్రచికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం యూఏఈకి తరలించారు.
ఈ ఘటనలో 174 మంది ప్రయాణికులను రక్షించేందుకు ధైర్యంగా వ్యవహరించిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో పాటు ఫ్లైదుబాయ్ సిబ్బందిని యూఏఈ ప్రభుత్వం ‘ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ పురస్కారంతో సత్కరించింది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్మిత్ ఎడమ చేతికి స్లింగ్ ధరించి కనిపించారు. తల వెనుక భాగంలో ఉన్న కుట్లు, చేతికి కట్టిన బ్యాండేజ్ ఆయన గాయాల తీవ్రతను స్పష్టంగా చూపించాయి.
స్మిత్‌తో మాట్లాడిన సమయంలో యూఏఈ అధ్యక్షుడు ఆయన తలపై ఉన్న కుట్లను దగ్గరగా పరిశీలించారు. అనంతరం ఆయన కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందని అడిగారు. “బహుశా రెండు నెలలు పట్టవచ్చు” అని స్మిత్ సమాధానమిచ్చారు.
