ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC), ఇతర ఎన్నికల కమిషనర్లకు కల్పించిన పూర్తి చట్టపరమైన రక్షణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలకంగా స్పందించింది. ఈ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. 2023 చట్టంలోని సెక్షన్ 16 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మహానా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. 2023లో పార్లమెంట్ ఆమోదించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ చట్టం ప్రకారం.. ఎన్నికల ప్రధాన కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లు తమ పదవీకాలంలో అధికారిక విధులు నిర్వహించే సమయంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన వ్యాఖ్యలు, చర్యలకు సంబంధించి చట్టపరమైన రక్షణ కల్పించారు.

ఈ చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం.. పదవిలో ఉన్న సమయంలో అధికారిక హోదాలో చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలకు సంబంధించి ఎన్నికల కమిషనర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా రక్షణ ఉంటుంది. అయితే ఈ నిబంధనలో ఎలాంటి మినహాయింపులు లేకుండా పూర్తి రక్షణ కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్, న్యాయవాది, సామాజిక కార్యకర్త అరుణ్ కుమార్ అగర్వాల్ వాదించారు.

అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించని సందర్భాల్లో లేదా తమ పరిధిని దాటి వ్యవహరించినప్పటికీ ఈ నిబంధన రక్షణ కల్పిస్తోందని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్లకు మంచి ఉద్దేశంతో వ్యవహరించని సందర్భాల్లో కూడా మినహాయింపులు లేకుండా రక్షణ కల్పించడం సరికాదని పేర్కొన్నారు. దీనివల్ల ఎన్నికల కమిషనర్లపై పౌరులు అందుబాటులో ఉన్న సివిల్, క్రిమినల్ చట్టపరమైన పరిష్కారాలను పొందే అవకాశం కోల్పోతారని పిటిషన్‌లో తెలిపారు.

మరోవైపు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కూడా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానాలు, గడువులు, ఓటర్లకు కల్పిస్తున్న రక్షణ చర్యలపై ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ఓటర్లను ఇబ్బంది పెట్టడానికి లేదా భయపెట్టడానికి ఈ ప్రక్రియను రూపొందించారా? అని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది.

ఢిల్లీలో సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేనప్పుడు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఇంత అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు ఆలస్యంగా సమర్పించినప్పటికీ స్వీకరించే అవకాశం ఉండాలని, గడువుల విషయంలో కఠినంగా వ్యవహరించకూడదని సూచించింది. ఇప్పటికే ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ ముసాయిదా జాబితాలో పేర్లు కనిపించని వారిని మళ్లీ ఫారం-6 సమర్పించాలని ఎందుకు కోరుతున్నారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది.

ఈ సందర్భంగా జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటరు నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే కారణంతో అతడి ఓటు హక్కును శాశ్వతంగా తొలగించవచ్చా? అని ప్రశ్నించారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారి పేర్లను స్థానిక భాషల్లో బ్లాక్ స్థాయిలో ప్రదర్శించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ అంశంపై కోర్టులో విచారణ కొనసాగుతున్నందున ఓటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

దీనికి స్పందించిన ఎన్నికల సంఘం ఢిల్లీలో గడువులను పొడిగించే అంశాన్ని పరిశీలిస్తామని, ఆలస్యంగా సమర్పించే ఎన్యూమరేషన్ ఫారాలను కూడా స్వీకరించే విషయాన్ని పరిశీలిస్తామని కోర్టుకు తెలిపింది. SIR వ్యవహారంపై తదుపరి విచారణను నవంబర్ 19కు వాయిదా వేశారు.

అంతేకాకుండా SIR ప్రక్రియలో ఓటరు పేరు తొలగించినా లేదా ఫారం సమర్పణ గడువు ముగిసినా.. ఆ వ్యక్తి పేరు మళ్లీ ఓటర్ల జాబితాలో చేరడానికి శాశ్వతంగా అడ్డంకి ఏర్పడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు ఓటర్లు జాబితాలో మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

#CEC, #CEC Immunity, #Chief Election Commissioner, #Election Commission of India, #Election Commissioners, #Section 16, #Supreme Court, #Supreme Court Notice