పండుగల సమయంలో షాపింగ్, కొత్త వాహనాలు, గృహోపకరణాలు కొనుగోలు చేసేందుకు చాలామంది రుణాలు తీసుకుంటున్నారు. అయితే, ఈఎంఐల భారం కుటుంబాల నెలవారీ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రుణాలు తీసుకున్న వారిలో సుమారు 60 శాతం మందికి కుటుంబ ఆదాయంలో గణనీయమైన భాగం ఈఎంఐల చెల్లింపులకే వెచ్చించాల్సి వస్తోంది. పండుగల కోసం అప్పు చేసి కొనుగోళ్లు చేయడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పండుగల సీజన్‌లో కొత్త ఫోన్ కొనడం, కుటుంబంతో విహారయాత్రకు వెళ్లడం, బహుమతులు ఇవ్వడం వంటివి చాలామందికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. అయితే, చేతిలో పొదుపు డబ్బు సరిపోకపోవడంతో చాలామంది రుణాలు, క్రెడిట్ కార్డులపై ఆధారపడుతున్నారు. నెలవారీ ఈఎంఐ తక్కువగానే కనిపించినా, అనేక రుణాల చెల్లింపులు కలిసినప్పుడు కుటుంబ బడ్జెట్‌పై తీవ్ర భారం పడుతోంది.

ఎక్స్‌పర్ట్ ప్యానెల్ అనే రుణ పరిష్కార సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, రుణాలు తీసుకున్న వారిలో సుమారు 60 శాతం మందికి నెలవారీ ఈఎంఐలు వారి కుటుంబ మొత్తం ఆదాయానికి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉంటున్నాయి. అంతేకాదు, దాదాపు 40 శాతం మంది ఇప్పటికే తీసుకున్న రుణాల ఈఎంఐలు చెల్లించేందుకు కొత్త రుణాలు తీసుకోవడం లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించడం ఆందోళన కలిగిస్తోంది.

అయితే, ప్రతి ఒక్కరూ షాపింగ్ కోసం మాత్రమే అప్పులు చేయడం లేదు. వైద్య అత్యవసర పరిస్థితులు, ఆరోగ్య సమస్యల కోసం 26 శాతం మంది రుణాలు తీసుకుంటున్నారు. పెళ్లిళ్లు, విద్య, కుటుంబ లేదా వ్యక్తిగత అవసరాల కోసం 22 శాతం మంది అప్పులు చేస్తున్నారు. వ్యాపార అవసరాలు, ఉద్యోగాలు కోల్పోవడం వంటి కారణాలతో 18 శాతం మంది, ఇంటి ఖర్చులు, రోజువారీ అవసరాల కోసం మరో 15 శాతం మంది రుణాలపై ఆధారపడుతున్నారు.

రుణాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో ఉద్యోగం కోల్పోవడం లేదా జీతం తగ్గడం ప్రధాన కారణంగా ఉంది. సుమారు 31 శాతం మంది ఈ కారణాలతో రుణాలు తిరిగి చెల్లించలేకపోతున్నట్లు సమాచారం. ఆదాయంతో పోలిస్తే ఈఎంఐలు ఎక్కువగా ఉండటం 28 శాతం మందికి సమస్యగా మారింది. ఒకేసారి అనేక రుణాలు తీసుకోవడం వల్ల 19 శాతం మంది ఇబ్బందులు పడుతున్నారు. వైద్య, కుటుంబ అత్యవసర పరిస్థితులు మరో 12 శాతం మందిపై ప్రభావం చూపుతున్నాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, పండుగల సమయంలో వచ్చే డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ‘నో కాస్ట్ ఈఎంఐ’ వంటి పథకాలు కొనుగోళ్లకు ప్రోత్సహిస్తాయి. అయితే, కొనుగోలు చేసే ముందు ఇప్పటికే ఉన్న ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బకాయిలు, కొత్త రుణంపై చెల్లించాల్సిన మొత్తం వడ్డీని లెక్కించుకోవాలి. ఆదాయంలో కొంత భాగాన్ని అత్యవసర ఖర్చుల కోసం తప్పనిసరిగా మిగుల్చుకోవాలి.

#Borrowers EMI, #Credit Card Debt, #EMI Burden, #Festive Season Loans, #Festive Shopping Loans, #Financial Planning, #Household Income, #No Cost EMI, #Personal Finance, #Personal Loan