సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR)పై ఎన్నికల కమిషన్‌లో విభేదాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ముగ్గురు కమిషనర్లు కలిసి సమావేశం కావడం ఇటీవల వెలువడిన విభేదాల వార్తల తర్వాత ఇదే తొలిసారి.

మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన ఈ సమావేశం అనంతరం ఎన్నికల సంఘం పలు అంశాలపై వివరణతో కూడిన ప్రకటన విడుదల చేసింది. SIR ప్రక్రియ, ECINet వ్యవస్థ, ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6, అభ్యంతరాలు, అలాగే కేంద్ర కేబినెట్ కార్యదర్శికి పంపిన లేఖకు సంబంధించిన వివాదంపై కమిషన్ తన వైఖరిని స్పష్టం చేసింది.

కేబినెట్ కార్యదర్శికి పంపిన లేఖపై వచ్చిన ప్రశ్నలకు ఈసీ వివరణ ఇచ్చింది. ఆ లేఖకు కమిషన్ విధానపరమైన నిర్ణయాలతో కానీ, ఐటీ విభాగంతో కానీ సంబంధం లేదని తెలిపింది. డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఒక అధికారి విధుల నిర్వహణకు సంబంధించిన అంశమే లేఖలో ఉందని పేర్కొంది. ఆ అధికారి చేసిన పని విభజన ఆదేశాలు ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సూచనల తర్వాత అమలు కాలేదని కూడా ఈసీ వెల్లడించింది.

SIR విషయంలో ముగ్గురు కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయన్న అంశంపైనా ఎన్నికల సంఘం స్పందించింది. 2025 జూన్ 24న దేశవ్యాప్తంగా SIR నిర్వహించేందుకు జారీ చేసిన ఉత్తర్వులకు ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదం ఉందని తెలిపింది. బిహార్ తర్వాత పశ్చిమ బెంగాల్‌తో పాటు మరో 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ప్రక్రియ కూడా ఏకగ్రీవ నిర్ణయంతోనే చేపట్టినట్లు పేర్కొంది.

SIRలో ‘అన్‌మ్యాప్డ్’గా గుర్తించిన లేదా వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్ల విషయంలో కూడా ఈసీ కొత్త విధానాన్ని ప్రకటించింది. ఇకపై బూత్ లెవల్ అధికారులు సంబంధిత ఓటర్ల ఇళ్లకు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరించి ECINetలో అప్‌లోడ్ చేస్తారు. ఇందుకోసం ప్రతి ఓటరును తప్పనిసరిగా ERO లేదా AERO కార్యాలయానికి విచారణకు పిలవాల్సిన అవసరం ఉండదని ఈసీ తెలిపింది. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విచారణ నిర్వహిస్తామని, వీలైనంత వరకు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని పేర్కొంది.

అదేవిధంగా రాత్రి ఆశ్రయ కేంద్రాల్లో ఉండేవారు, కార్మికులు, పేదలు, నిరాశ్రయుల కోసం జిల్లా ఎన్నికల అధికారులు ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు, క్యాంపులు ఏర్పాటు చేయాలని ఈసీ ఆదేశించింది. SIR సమయంలో ఓటర్లకు ఎదురయ్యే సమస్యలను తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

ఫారం-6పై కూడా ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. SIRకు సంబంధించిన అదనపు డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించిందని పేర్కొంది. అయితే SIR అమల్లో లేని సమయంలో మాత్రం 1960 నాటి Registration of Electors Rules ప్రకారం ఉన్న ఫారాలనే ఉపయోగిస్తామని తెలిపింది.

ఇటీవల ఫారం-6లో మార్పులు చేశారంటూ ఎన్నికల కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారన్న వార్తలు వెలువడ్డాయి. అయితే ఫారం-6లో ఎలాంటి మార్పు చేయలేదని, తల్లిదండ్రులు లేదా తాత, అమ్మమ్మ పేర్లు పాత ఓటర్ల జాబితాలో ఉన్నాయా అనే అంశానికి సంబంధించిన Annexure-D అనే అదనపు డిక్లరేషన్‌ను మాత్రమే జత చేశామని ఈసీ గతంలోనే స్పష్టం చేసింది.

ECINet డిజిటల్ వ్యవస్థపై కూడా కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి, IIT లేదా IIITకు చెందిన స్వతంత్ర నిపుణుడిని కూడా అందులో చేర్చనున్నట్లు తెలిపింది. ఈ కమిటీ ECINet వ్యవస్థ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుందో లేదో పరిశీలించనుంది. భవిష్యత్‌లో కొత్త ఐటీ మాడ్యూల్స్ లేదా పోర్టల్స్ ప్రవేశపెట్టే ముందు అధికారుల కమిటీ వాటిని పరిశీలించాలని కూడా నిర్ణయించింది.

#CEC Gyanesh Kumar, #ECINet, #Election Commission, #Election Commission of India, #Form 6, #Gyanesh Kumar, #SIR, #SIR Row, #Special Intensive Revision, #Sukhbir Singh Sandhu, #Vivek Joshi