ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో జరుగుతున్న నిరసనలపై పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ, ఆదివారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాల సభ్యులు, ‘కాక్రొచ్ జనతా పార్టీ’ (CJP) మద్దతుదారులు సహా 200 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
కనాట్ ప్లేస్, ఆర్కే ఆశ్రమ్ మార్గ్, విజయ్ చౌక్ తదితర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. నిరసనకారులు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా, పోలీసులు వారిని బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిరసనలను కవర్ చేస్తున్న కొందరు జర్నలిస్టులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ నిరసనలకు CJPతో పాటు పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీ స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టారు. శనివారం కూడా జంతర్ మంతర్‌కు వెళ్లకుండా నిరసనకారులను అడ్డుకోవడంతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలను అదుపులోకి తీసుకున్నారు.
మహిళా నిరసనకారులను పురుష పోలీసు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ఆరోపించింది. మహిళలను తరలించిన పోలీసు బస్సుల్లో మహిళా సిబ్బంది లేరని, కొన్ని బస్సుల్లో లైట్లు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేసింది. నిరసనకారుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, తమ సభ్యులను అక్రమంగా నిర్బంధించారని ఆరోపించింది.
ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అధ్యక్షురాలు నేహా బోరాను విజయ్ చౌక్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటాస్ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆయనపై పోలీసులు దాడి చేశారని SFI ఆరోపించింది. అలాగే, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైద్యులు, విద్యార్థులు, ఇతర ఆందోళనకారులను కూడా అదుపులోకి తీసుకున్నారని CJP పేర్కొంది.
మరోవైపు, అక్రమ నిర్బంధాలపై వచ్చిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. శాంతియుతంగా నిరసన తెలిపే వారిని చట్ట ప్రక్రియకు విరుద్ధంగా అదుపులోకి తీసుకోరాదని స్పష్టం చేసింది. మెట్రో, రైలు సేవలు అవసరమైన సందర్భాల్లో మాత్రమే పరిమితం చేయాలని, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. ఢిల్లీలోని బారికేడ్లను సమీక్షించాలని, ప్రజల రాకపోకలకు అనవసర అడ్డంకులు కల్పించవద్దని సూచించింది. అయినప్పటికీ ఆదివారం తాజా నిర్బంధాలు కొనసాగడంతో పోలీసుల చర్యలపై విమర్శలు మరింత పెరిగాయి.
