భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్, ఆయన భార్య కరోలిన్ పార్మెలిన్‌కు రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అక్టోబర్ 5న సోమవారం సాయంత్రం జరిగిన ఈ విందులో జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ వంటకాలను అతిథులకు వడ్డించారు. హిమాలయ ప్రాంతాల ఆహార సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ మెనూను ప్రత్యేకంగా రూపొందించారు.
లడఖ్‌కు చెందిన అడవి రేగు ఆకుల సూప్‌తో విందు ప్రారంభమైంది. ‘జా థుక్’ పేరుతో పిలిచే ఈ సూప్‌లో శీతాకాలపు బఠానీలు, వేయించిన చిరుధాన్యాలను ఉపయోగించారు. దీనితో పాటు వివిధ రకాల రొట్టెలను అందించారు. లడఖ్, జమ్మూ ప్రాంతాల్లో తయారయ్యే సంప్రదాయ చీజ్‌లతో మరో ప్రత్యేక సలాడ్‌ను కూడా వడ్డించారు. ఇందులో ఎండిన ఆపిల్ ముక్కలు, వాల్‌నట్స్, అడవి కేపర్స్‌తో పాటు సీ బక్‌థార్న్ పండ్ల రసం, తేనెను ఉపయోగించారు.
జమ్మూ ప్రాంతానికి చెందిన ‘కింబ్ చాట్’ కూడా మెనూలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉడికించిన చామగడ్డ, చిలగడదుంపలు, బియ్యప్పిండి క్రిస్పీలు, తియ్యటి పెరుగు, చింతపండు సాస్‌తో ఈ వంటకాన్ని తయారు చేశారు. కశ్మీర్ ప్రత్యేక వంటకమైన ‘నదూర్ కబాబ్’ను కూడా అతిథులకు అందించారు. తామర దుంపలతో తయారు చేసిన ఈ కబాబ్‌ను కశ్మీరీ మసాలాలతో రుచికరంగా తయారు చేసి, వాల్‌నట్ చట్నీతో వడ్డించారు.
లడఖ్‌కు చెందిన ‘ఫోరోక్ నంగ్కా’ అనే మరో సంప్రదాయ వంటకం కూడా విందులో చోటు దక్కించుకుంది. గోధుమ పిండితో తయారు చేసిన మోక్ మోక్ డంప్లింగ్‌లో టర్నిప్ ఆకులు, కేపర్ ఆకులను నింపి బొగ్గులపై కాల్చి తయారు చేస్తారు. దీనిని టమాటా, ఉల్లిపాయలతో చేసిన సాస్‌తో అందించారు.
ప్రధాన వంటకాల విషయానికి వస్తే కశ్మీర్ సంప్రదాయ రుచులకు పెద్దపీట వేశారు. ‘చమన్ ఖలియా’ పేరుతో పిలిచే పనీర్ వంటకాన్ని పాలు, పసుపు, సున్నితమైన మసాలాలతో తయారు చేశారు. ‘హాఖ్’ పేరుతో పిలిచే ఆకుకూరల వంటకం, పెరుగు, సోంపు, అల్లం వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన ‘దమ్ ఆలూ’, పుల్లటి మసాలా రుచితో చేసే ‘త్సోక్ వంగన్’ అనే వంకాయ కూరను వడ్డించారు.
ఈ విందులో ‘కన్నా గుచ్చ్ పులావ్’ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కశ్మీర్‌లో లభించే గుచ్చి పుట్టగొడుగులు, సుగంధ ద్రవ్యాలతో ఈ పులావ్‌ను తయారు చేశారు. దీనితో పాటు తెల్ల ముల్లంగి, పెరుగుతో చేసిన ‘ముజ్ చట్నీ’, సంప్రదాయ షీర్మాల్, కట్లమ్ రొట్టెలను అందించారు.
డెజర్ట్‌లోనూ కశ్మీర్, లడఖ్ ప్రత్యేకతలను చాటిచెప్పారు. ఎండిన ఖర్జూరాలు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, కొబ్బరి ముక్కలతో తయారు చేసిన ‘షుఫ్తా’, పాలు, సెమోలినా, కుంకుమపువ్వు, యాలకులు, డ్రై ఫ్రూట్స్‌తో చేసిన ‘ఫిరిన్’ను వడ్డించారు. లడఖ్‌కు చెందిన ‘ఫేమర్’ అనే స్వీట్‌ను కాల్చిన బార్లీ, బెల్లం, వెన్నతో తయారు చేసి, మృదువైన చురా చీజ్‌తో అందించారు. చివరగా తాజా పండ్లను కూడా వడ్డించారు.
స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్ అక్టోబర్ 5 నుంచి 7 వరకు మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చారు. ఇది ఆయన భారతదేశానికి వచ్చిన తొలి అధికారిక పర్యటన. అంతకుముందు అక్టోబర్ 5న ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు.
