విద్యార్థుల నిరసనలకు మద్దతు తెలిపిన తర్వాత తాను భయపడ్డానంటూ సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. శనివారం అర్ధరాత్రి జిమ్‌లో తీసుకున్న షర్ట్‌లెస్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ, “సల్మాన్ ఖాన్ డర్ గయా… హ్మ్… జో డర్ గయా వో మర్ గయా” (భయపడినవాడు చచ్చినట్టే) అని క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్టును ట్రోల్స్‌కు ఇచ్చిన కౌంటర్‌గా అభిమానులు భావిస్తున్నారు.

ఇంతకుముందు సల్మాన్ ఖాన్, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనలకు మద్దతు తెలుపుతూ, ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం చాలా తీవ్రమైనదని పేర్కొన్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన నేపథ్యంలో, విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వారి భద్రతతో పాటు తల్లిదండ్రుల ఆందోళన కూడా ముఖ్యమని చెప్పారు.

అలాగే నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్కు కూడా సల్మాన్ ప్రత్యేకంగా సందేశం పంపారు. “సోనం… చాలు బ్రో, ఇక దీక్ష కొనసాగించొద్దు. కావాలంటే మా ఇంటి నుంచి భోజనం పంపిస్తాను” అంటూ ఆయన ఆప్యాయంగా కోరారు.

ఈ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. ఉద్యమం శాంతియుతంగా సాగాలని, బాధ్యులపై పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

#Exam Paper Leak, #Salman Khan, #Salman Khan Instagram, #Salman Khan Trolls, #Sonam Wangchuk, #Student Protest