తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళ నటుడు విజయ్ ఆరు రోజుల లండన్ పర్యటన రాజకీయ వివాదానికి దారితీసింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు అధికారిక పర్యటనగా వెళ్లిన విజయ్.. తాజాగా చెన్నైకి తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో తమిళనాడుకు రూ.15,300 కోట్ల విలువైన పెట్టుబడి హామీలు వచ్చాయని అధికార TVK వెల్లడించింది. ఈ పెట్టుబడుల ద్వారా 10 వేలకుపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
అయితే విజయ్ లండన్ పర్యటనపై ప్రతిపక్ష డీఎంకే, బీజేపీ నేతలు విమర్శలు చేశారు. ఈ పర్యటన పెట్టుబడుల కోసం కాకుండా ‘విహార యాత్ర’లా సాగిందని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే తమిళనాడులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల పెట్టుబడులను కొత్త పెట్టుబడులుగా ప్రభుత్వం చూపిస్తోందని ఆయన ఆరోపించారు.
డీఎంకే నేతలు కూడా విజయ్ పర్యటనపై ప్రశ్నలు లేవనెత్తారు. లండన్ పర్యటనలో ఎవరెవరిని కలిశారు? ఎంత మొత్తంలో కొత్త పెట్టుబడులు వచ్చాయి? వాటి అమలు ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? వంటి వివరాలను విజయ్ వెల్లడించాలని డీఎంకే నేతలు కోరారు.
మరోవైపు, విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ఈ విమర్శలను ఖండించింది. లండన్ పర్యటనలో వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనల వివరాలను పార్టీ వెల్లడించింది. సమ్వర‍్ధన మదర్సన్ ఇంటర్నేషనల్, యూరప్-యూకే భాగస్వాములతో కలిసి తయారీ, లాజిస్టిక్స్, అసెంబ్లీ రంగాల్లో రూ.11,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. దీనివల్ల సుమారు 7,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
అదేవిధంగా స్వీడన్‌కు చెందిన సిగ్మా టెక్నాలజీ గ్రూప్ తిరుచిరాపల్లి, చెన్నైలో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కార్యకలాపాలను విస్తరించనుందని TVK తెలిపింది. ఈ విస్తరణ ద్వారా సుమారు 600 ఉద్యోగాలు రావచ్చని పేర్కొంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY) కూడా రూ.1,000 కోట్ల విలువైన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుందని, దీనివల్ల 2,000కుపైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇక విల్సన్ పవర్ సొల్యూషన్స్ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఎనర్జీ ఎఫిషియెంట్ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ కోసం రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నట్లు TVK తెలిపింది. ఈ ప్రాజెక్టుతో సుమారు 400 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తం మీద ఆటో కాంపోనెంట్స్, R&D, పునరుత్పాదక ఇంధనం, పవర్ గ్రిడ్ పరికరాలు, GCCలతో పాటు పలు రంగాల్లో ఒప్పందాలు కుదిరినట్లు తెలిపింది.
మొత్తంగా విజయ్ లండన్ పర్యటనపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నప్పటికీ, TVK మాత్రం రూ.15,300 కోట్ల పెట్టుబడి హామీలు, 10 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు ఈ పర్యటన ద్వారా లభించాయని చెబుతోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఈ పెట్టుబడుల్లో కొత్తవి ఎంత? ఇప్పటికే తమిళనాడులో ఉన్న కంపెనీల విస్తరణ ఎంత? అనే వివరాలను ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాయి.
