ఆమె చెప్పిన 4 అడుగుల ప్రణాళిక వైరల్!
ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షలకు పైగా వ్యూస్ పొందిన ఒక వీడియోలో, స్నేహ రాజ్‌గురు (Sneha Rajguru) ప్రశాంతమైన, ప్రకృతితో మమేకమైన జీవనశైలిని ఎలా ఎంచుకున్నానో వివరించారు. పెర్మాకల్చర్ (శాశ్వత వ్యవసాయం), ఆహార భద్రత, మానసిక ప్రశాంతతపై దృష్టి పెట్టి ఆమె ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.
కార్పొరేట్ ఉద్యోగ ఒత్తిడితో అలసిపోయిన ఈ యువతి 29 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుని, తన తండ్రితో కలిసి ఒక ఫార్మ్ స్టేను ప్రారంభించారు. ప్రకృతి సహజమైన వ్యవసాయ పద్ధతులు, పండ్ల పెంపకం, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యతనిస్తూ.. ఆమె తనకంటూ ఒక స్వయం సమృద్ధి గల జీవితాన్ని నిర్మించుకున్నారు.
తన ప్రయాణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ, భూమిని కొనుగోలు చేసి అందమైన ప్రకృతి వ్యవస్థను ఎలా సృష్టించుకున్నారో వివరించారు. ఆమె పంచుకున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ వేలాది మందిని ఆకట్టుకుంటోంది.
వైరల్ అయిన ఆ వీడియోలో స్నేహ రాజ్‌గురు ఇలా అన్నారు: “నేను 29 ఏళ్లకే రిటైర్ అయ్యాను. ఆ వెనుక ఉన్న రహస్యం ఏంటో చెప్తాను వినండి.” కార్పొరేట్ జీవితాన్ని విడిచిపెట్టి ప్రశాంతమైన జీవనశైలిని పొందడానికి ఆమె పాటించిన 4 దశలు ఇవే:
మొదటి దశ (Step 1):
చిన్న భూమిని కొనుగోలు చేయండి. నేను నా భూమికి ‘బాబ్ బేటీ ఫార్మ్’ (Bab Beti Farm) అని పేరు పెట్టినట్లుగానే, మీ మనసుకు హత్తుకునేలా ఒక మంచి పేరు పెట్టుకోండి.
రెండవ దశ (Step 2):
పండ్ల మొక్కలను నాటండి. అవి మీతో పాటు పెరుగుతాయి, వాటికి తక్కువ శ్రమ సరిపోతుంది. రాబోయే అనేక సంవత్సరాల పాటు మీకు పండ్లను అందిస్తూనే ఉంటాయి.
మూడవ దశ (Step 3):
మీ ఆహారాన్ని మీరే పండించుకోవడం మొదలుపెట్టండి. తద్వారా లాక్‌డౌన్ లేదా యుద్ధం వంటి ఎలాంటి కష్టకాలం వచ్చినా, మీరు ఎవరిపైనా (చివరకు ప్రభుత్వాలపై కూడా) ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
నాల్గవ దశ (Step 4):
మీ భూమిని రకరకాల పూలతో నింపండి. మీ కళ్లకు రోజూ అందమైన దృశ్యాలు కనిపిస్తుంటే, మీ మనసుకు ఆసుపత్రులకు వెళ్లాల్సిన పనే ఉండదు. అన్నింటికంటే ముఖ్యంగా, కేవలం కడుపు నింపేదే కాకుండా.. మీ మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక ప్రదేశాన్ని సృష్టించుకోండి. ఎందుకంటే రిటైర్మెంట్ అంటే వయసు కాదు, ఒత్తిడి బదులు ప్రశాంతతను ఎంచుకోవడం.
“మీరు కూడా ఇలాంటి జీవితాన్ని కలలు కంటున్నారా? నాతో పాటు రండి, మీ ప్రయాణం ఇక్కడే ప్రారంభం కావచ్చు,” అని ఆమె ఆ వీడియో క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా ప్రచారమై, 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కామెంట్స్ సెక్షన్‌లో నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.
“ఫార్మ్‌కు పెట్టిన పేరు చాలా బాగుంది. ఇది నా కల కూడా!” అని ఒక యూజర్ రాశారు.
“నేను కూడా ఒత్తిడి కంటే ప్రశాంతతనే కోరుకుంటున్నాను,” అని మరొకరు కామెంట్ చేశారు.
“ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఎప్పటికైనా నేను కూడా నాకంటూ సొంతంగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటానని ఆశిస్తున్నాను. మీరు చేస్తున్న పని నాకు చాలా నచ్చింది,” అని మూడో యూజర్ తెలిపారు.
మరో నెటిజన్ స్పందిస్తూ, “మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నారు? అక్కడ భూమి ధర ఎంత?” అని ప్రశ్నించారు.
