అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినాయకుడు అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

డింపుల్ యాదవ్ సీఎం అభ్యర్థిత్వం?

రాబోయే ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ భార్య, ఎంపీ -డింపుల్ యాదవ్‌ను సమాజ్‌వాదీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ఆయన నేరుగా అవునని కానీ, కాదని కానీ అనకుండా దాటవేశారు. ఈ ప్రశ్నపై ఆయన నవ్వుతూ సమాధానం ఇవ్వడం రాజకీయంగా అనేక ఊహాగానాలకు తావిచ్చింది.

మహిళా ఓటర్లపై ప్రత్యేక దృష్టి:

2027 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమాజ్‌వాదీ పార్టీ మహిళల కోసం అనేక కీలక హామీలను ప్రకటించింది. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ‘స్త్రీ సమ్మాన్ సమృద్ధి యోజన’ కింద మహిళలకు ప్రతి ఏటా రూ. 40,000 ఆర్థిక సాయం అందిస్తామని అఖిలేష్ యాదవ్ వెల్లడించారు.

ఇంటర్ విద్యార్థినులకు లాప్‌టాప్‌లు:

మహిళలు, యువతుల ఆర్థిక స్వావలంబన, రక్షణే లక్ష్యంగా ఇంటర్మీడియట్ పాసైన బాలికలకు లాప్‌టాప్‌లు పంపిణీ చేయడంతో పాటు, గతంలో ఉన్న పెన్షన్ పథకాలను మరింత విస్తరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

బీజేపీపై విమర్శలు:

మహిళా సంక్షేమం కేవలం నినాదాలకే పరిమితం కాకూడదని, బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. రాబోయే ఎన్నికల్లో మహిళలకు పెద్దపీట వేస్తామని అఖిలేష్ స్పష్టం చేశారు.

ఏది ఏమైనా డింపుల్ యాదవ్ సీఎం అభ్యర్థిత్వంపై అఖిలేష్ యాదవ్ కావాలనే స్పష్టత ఇవ్వకపోవడం వల్ల, యూపీ రాజకీయాల్లో ఆమె చుట్టూ చర్చ మరింత జోరందుకుంది.

#Akhilesh Yadav, #Dimple Yadav, #Dimple Yadav CM Candidate, #Samajwadi Party, #SP Election Promise, #UP Assembly Elections 2027, #UP Election 2027, #Uttar Pradesh Elections, #Uttar Pradesh Politics