శ్రీరాముని పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయోధ్యలో ఆనందోత్సాహాలు ఉప్పొంగుతున్న శుభవేళ. ప్రజల హృదయాల్లో ఒకే పేరు – రాముడు. న్యాయం, వినయం, ధర్మనిష్ఠల ప్రతిరూపంగా ఉన్న శ్రీరాముడు కాసేపట్లో రాజ్యభారాన్ని స్వీకరించబోయే సమయంలో, ఎవ్వరూ ఊహించనిదిగా ఆ దృశ్యం మారిపోయింది. ఆనందోత్సాహాల స్థానంలో విషాదం. రాజసభలో నిశ్శబ్ద వాతావరణం. కారణం – దశరథుడు, భార్య కైకేయికి ఇచ్చిన మాటతో దశరథుడు విచారసాగరంలో మునిగిపోతాడు.

రాజ్యాన్ని వదిలి పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయమనే ఆజ్ఞను రామునికి తెలియజేయటానికి కూడా ఆయనకి ధైర్యం ఉండదు. ఈ పరిస్థితిలో, కైకేయి రామునికి ఈ విషయం చెప్పినప్పుడు రాముడు స్పందించిన తీరుని వాల్మీకి మహర్షి ‘న హమర్థ పరో దేవి’… అమ్మా! సంపదల కోసం నేను జీవించను. ‘మాం ఋషిభిస్తుల్యం, కేవలం ధర్మమాస్థితం’…. ఋషుల వలె ధర్మాన్ని ఆచరించేవాడ్నిగా తెలుసుకోమ్మా’ అంటాడు. ఇది అంధ విధేయత కాదు. ఇది ఆయన చైతన్య పూర్వక నిర్ణయం. రాముడు తండ్రి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. తన హక్కును వినియోగించుకోవచ్చు కానీ తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టటమే రాజధర్మమని గ్రహించాడు.

అయితే ఆయన ఆజ్ఞను పాటించటం కేవలం కుమార ధర్మం మాత్రమేనా? లేక దానిలో మరింత లోతైన ధర్మబోధ, నాయకత్వ దృష్టి, విలువల పట్ల నిబద్ధత దాగి ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం వాల్మీకి రామాయణం వైపు తిరగాలి.
‘పితుర్వచన నిర్దేశాత్, పితుర్వచన గౌరవాత్’…. తండ్రి మాట గౌరవం కోసం, ఆయన ఆజ్ఞను పాటించాలనుకుంటున్నాను అంటాడు. శ్రీరాముడు దశరథుడు ఇచ్చిన వాగ్దానం విఫలమైతే, రాజ్యంపై, రాజుపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది. అందుకే రాముడు తండ్రికి చెప్పి, ఓదార్పు ఇచ్చాడు.

కౌసల్యాదేవి రాముని వనవాస వార్త విని దుఃఖించినప్పుడు ఆమెను కూడా ధైర్యపరుస్తూ, ఓదార్చిన తీరు అమోఘం. తండ్రిగారు మనకి రాజు; మనల్ని పోషించే దశరథుడు మనకి గురుస్థానంలో ఉన్నారు – మనకంటే పెద్దవారు. అందరితో పాటు మనిద్దరమూ కూడా ఆయన ఆజ్ఞని పాటించి తీరాలి. స్త్రీకి స్వర్గప్రాప్తికి భర్త శుశ్రూష ఒక్కటే మార్గమమ్మా అని వివరించాడు. ‘దశరథస్తు ధర్మాత్మా’ అంటారు మహర్షి. అంటే పితృవాక్యం ధర్మవాక్యం అని ఒక సందేశాన్నిస్తున్నారు. ఈ సందేశం ఎప్పటికీ సత్యమే. ఇదంతా విని కౌసల్య రాముని ధర్మనిష్ఠకి పొంగిపోయింది.

లక్ష్మణ స్వామికి శ్రీరాముడు వనవాసం చేయాలన్న వార్త తెలియగానే, కోపంతో ఊగిపోతూ ‘హనిష్యే పితరం వృద్ధం’…. ముసలివాడైన తండ్రిగారిని అంతం చేస్తానన్నాడు. తండ్రిగారి ఆజ్ఞని తప్పకుండా ఆచరించాల్సిందేనని తమ్ముడికి కర్తవ్య బోధ చేస్తాడు. ఈ విధంగా ఏక కాలంలో కుటుంబానికి బలం ఇచ్చినవాడు శ్రీరాముడు – తండ్రి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టటానికి, రాజ్య ప్రతిష్టను కాపాడటానికి, తన హక్కుని త్యాగం చేశాడు. ఇది నేటి రాజకీయ నాయకత్వానికి పెద్ద పాఠం. మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకునే బాధ్యత తీసుకోవడం, ప్రజాస్వామ్య విశ్వాసానికి పునాది అవుతుంది.

పాశ్చాత్య రాజకీయాలకు భిన్నమైన సందేశం ఇది. నేటి సమాజంలో ‘నా హక్కు’ అనే నినాదం బలంగా వినిపిస్తోంది. హక్కుల కోసం పోరాటం అవసరమే కానీ, మన కర్తవ్యాన్ని మరిచిపోయే స్థాయికి చేరితే సమాజం సమతుల్యత క్షీణిస్తుంది. రాముడు యువరాజు. అతనికి రాజ్యంపై హక్కు ఉంది. ప్రజాభిమానం మెండుగా ఉంది. సైనిక బలం ఉంది. కానీ, తన హక్కును వదిలి కర్తవ్యాన్ని ఎంచుకున్నాడు. ఇది ఆయన ఆత్మవిశ్వాసానికి సూచిక. తనకి రాజ్యాధికారం రావాల్సిందే కానీ, తన ధర్మాన్ని విడువలేదు.

అరణ్యవాసం – నాయకత్వ శిక్షణ:

ఇంకొక కోణంలో చూస్తే అరణ్యవాసం రాముని నాయకత్వానికి ఒక శిక్షణా శిబిరం అయింది. రాజప్రాసాదంలో అన్ని హంగులతో పెరిగిన శ్రీరాముడు, అరణ్యంలో ఋషుల కష్టాల్ని ప్రత్యక్షంగా అర్థం చేసుకున్నాడు. ప్రజల బాధలను ప్రత్యక్షంగా అనుభవించాడు. అటు రాక్షసులతోనూ, ఇటు ఋషులతోనూ, సాధారణ జీవితాన్ని గడుపుతూ, ఉపశమనం, సహనం, విధేయత, ధర్మనిష్ఠని పాటిస్తూ, సమగ్ర నాయకుడిగా తీర్చిదిద్దబడ్డాడు. గిరిజనుల జీవన విధానాన్ని తెలుసుకున్నాడు. పాలనలో ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకోవడం వారితో సహజీవనం ఎంత అవసరమో రాముడి జీవితం చెబుతోంది. అధికారంలోకి రాకముందే అనుభవం సంపాదించిన నాయకుడిగా ఎదగగలిగాడు. కనుక అరణ్యవాసం రాజ్యభారానికి శిక్షణ శిబిరంగా చెప్పొచ్చు.

విలువలపై నిలిచిన వ్యక్తిత్వం:

రాముని వనవాస నిర్ణయం తక్షణ ఫలితాల కోసం కాదు, దీర్ఘకాలిక విలువల కోసం. తన వ్యక్తిగత ఆనందం, తల్లిదండ్రుల ప్రేమ, రాజ్యాభిషేక గౌరవం మొదలైనవన్నీ పక్కన పెట్టి, ధర్మాన్ని ఎంచుకుని ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అనిపించుకున్నాడు.

ఈ సందర్భంలో మనం ఒక ప్రశ్న వేసుకోవాలి – నేటి కుటుంబాల్లో, సంస్థల్లో, ప్రభుత్వాల్లో నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నాం? తక్షణ లాభాల కోసమా లేక దీర్ఘకాలిక నైతిక ప్రమాణాల కోసమా? సమాజం వేగంగా మారుతోంది. పోటీ, ఆకాంక్ష, వ్యక్తిగత ప్రాధాన్యతలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో రాముడి జీవితం ఒక స్ఫూర్తి. మాట నిలబెట్టుకోవడం, బాధ్యతని నిస్వార్థంగా స్వీకరించటం, సంక్షోభంలో ధైర్యంగా నిలబడటం, హక్కుల కంటే కర్తవ్యాన్ని ముందుంచటం, తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడటం మొదలైనవి ఏ కాలానికైనా వర్తిస్తాయి.

శ్రీరాముని జీవితం మనకిచ్చే సందేశం ఒక్కటే. అది ‘అధికారం గొప్పది కాదు; ఆ అధికారాన్ని నిలబెట్టే విలువలే గొప్పవి’. ఈ శ్రీరాముని విధేయతను చాలా మంది త్యాగంగా చూస్తారు కానీ, అది త్యాగం కంటే ఎక్కువ. అది స్వచ్ఛంద ధర్మం. అందుకే రామకథ యుగయుగాల పాటు మన హృదయాల్లో వెలుగుతుంది. అది భక్తి కథ మాత్రమే కాదు, ఆత్మవిమర్శకు ఆహ్వానం.

-దావులూరి రామకృష్ణ శర్మ

#Dharma, #Hindu Spirituality, #Leadership Lessons, #Lord Rama, #Ramayana, #secrets of sreerama, #Sri Rama, #Sri Rama Dharma, #Sri Rama Leadership, #Valmiki Ramayana