సూర్యునికంటే ముందే మేల్కొనడం, చన్నీటి స్నానం, ఒంటిపూట భోజ నం, ఉల్లి, వెల్లుల్లి వంటి మసాలా దినుసులతో సహా మద్యమాంసాదులకు దూరంగా ఉండటం, పాదరక్షలు లేకుండా నడవడం, అశ్లీలానికి, పరనిందకు తావివ్వకపోవడం, బ్రహ్మచర్యం, భూశయనం, విభూతి, చందన ధారణం, ఆలయ సందర్శనం, సత్సంగం, భజనలు చేయడం, పురాణ పఠనం, శరణుఘోష చెప్పుకోవడం, భగవద్ధ్యానంలో కాలం గడపడం … ఇవీ ఈ దీక్ష తీసుకున్న వారు పాటించవలసిన నియమాలు.

నలభై రోజులకు పైగా ఈ నియమాలన్నింటినీ పాటిస్తూ, ఆత్మప్రక్షాళన చేసుకుంటారు అయ్యప్ప భక్తులు. దీక్షాకాలంలోనే కాదు, ఆ తర్వాత కూడా అదే మార్గాన్ని అవలంబించిన వారికి జీవితమంతా సన్మార్గ సౌరభాలు వెదజల్లుతుందనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. అయ్యప్పదీక్షలో బాహ్యంగా కనిపించే నియమాల కన్నా, అందులోని ఆధ్యాత్మిక, ఆరోగ్య రహస్యాలను తెలుసుకుంటే ఎవరికైనా సరే జీవితంలో ఒక్కసారైనా మాలధారణ చెయ్యాలనిపించకమానదు.

అయ్యప్ప జన్మరహస్యం

పూర్వం మహిషి అనే ఓ దుష్టరాక్షసి హరిహరులకు జన్మించిన కుమారుని చేతిలో తప్ప మరేవిధంగానూ చావు లేనటువంటి వరం పొందింది. ఆ వరప్రభావంతో రెచ్చిపోయి, దేవతలను, మునులను, మానవులను పీడించసాగింది. లోకకంటకంగా తయారైన ఆ రాక్షసిని అంతం చేసేందుకు విష్ణువు ఓ పథకం పన్నాడు. దాని ప్రకారం దేవతలకు మోహిని రూపంలో అమృతం పంచుతుంటాడు. అది చూసి మోహించిన మహేశ్వరుడు తమకంతో ఆమెను తాకుతాడు. ఫలితంగా దివ్యతేజస్సుతో ముద్దుల మూటకట్టే బాలకుడు ఉద్భవిస్తాడు. లోకకల్యాణార్థం ఆ బిడ్డ మెడలో దివ్య మణిహారాన్నుంచి పంబానదీ తీరంలో వదిలారు.ఆ పిల్లవాడు సంతానం కోసం పరితపిస్తున్న పందళ రాజుకు దొరికాడు. పిల్లలు లేని ఆ రాజు ఆ బాలుణ్ణి దైవవరప్రసాదంగా భావించి, కంఠంలో హారంతో దొరికిన కారణంగా మణికంఠుడు అని పేరు పెట్టి తన రాజ్యానికి తీసుకెళ్లి అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. దినదిన ప్రవర్థమానంగా పెరిగి పెదై్దన మణికంఠుడు మహిషితో భీకరంగా పోరాడి, అంతమొందిస్తాడు. ఇదీ అయ్యప్పస్వామి చరితామృతం.

భగవంతుని దృష్టిలో భక్తులందరూ ఆయన బిడ్డలే. తల్లిదండ్రులు తమ బిడ్డలు క్రమశిక్షణతో పెరగాలని, ఆరోగ్యంగా ఉండాలని, మంచి మార్గంలో నడచుకోవాలని కోరుకోవడం సహజం. అయ్యప్ప స్వామి కూడా తన బిడ్డలైన మనందరం క్రమశిక్షణ, భక్తి విశ్వాసాలతో మెలగాలనే ఉద్దేశంతో ఒక దీక్షాపద్ధతిని విధించాడు. తాను చెప్పిన దీక్షను పాటించి, తనను దర్శించుకున్న వారికి కోరిన వరాలను అనుగ్రహిస్తానన్నాడు. అందుకే ప్రతి ఒక్కరూ నలభై రోజులపాటు దీక్షతీసుకుని, భయంకర మృగాలుండే అడవిమార్గం గుండా కాలినడకన వచ్చి ఆయన కొలువై ఉన్న కొండను చేరి, స్వామిని కొలవడం సంప్రదాయంగా మారింది. ఈ సంప్రదాయాన్ని పాటించడం మనకెంతో మేలు చేస్తుందని గ్రహించి, దానికి అనుగుణంగా మెలగడం మంచిది.

అందరూ అర్హులే…

భక్తి, శ్రద్ధ, నియమం, నిష్ఠ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ స్వామి దీక్ష చేపట్టేందుకు అర్హులే. వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తూనే దీక్ష పాటించవచ్చు. ఉదాహరణకు ఈ దీక్షలో ఉన్నవారు మాంసభక్షణ చేయరాదు. అలాగని మాంసం విక్రయించే వారు దీక్ష తీసుకోరాదన్న నియమం ఏమీ లేదు. అదేవిధంగా శుభ్రత ముఖ్యం. అంతేకాని పారిశుద్ధ్య వృత్తిలో ఉన్న వారు స్వామి మాల వేసుకోరాదన్న నిబంధన ఎక్కడా లేదు. అలాగే స్వామి మాల వేసుకున్న వారు మైల, అంటు ఉండే ప్రదేశాలకు పోరాదు. అయితే మైలబట్టలను ఉతికి శుభ్రం చే సే వృత్తిలోని వారు అయ్యప్ప దీక్ష తీసుకోరాదనే నిబంధన ఏమీ లేదు. అందుకే స్వామిని సేవించుకోవాలన్న అవకాశం, అభిలాష, విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ తమ వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తూనే స్వామి మాల ధరించవచ్చు… రుతుధర్మం ఉన్న స్త్రీలు మాత్రం మాల ధరించడానికి వీలు లేదు. రుతుక్రమం ఇంకా మొదలు కాని బాలికలు, శారీరకంగా ఆ ధర్మం దాటిపోయిన వారు మాలధారణ చేయవచ్చు.

నియమాలు పాటించని దీక్ష నిష్ఫలం

కపట భక్తి, పటాటోపం, ప్రచారాడంబరం, సంపద, బల ప్రదర్శన, అహంకారం, అతిశయంతోనూ, మాలను అడ్డుపెట్టుకుని చేసే వంచనలు, కేవలం పదిమంది దృష్టిలోనూ ‘మంచివారనిపించుకోవడం కోసం’ చేసే ఏ ఆరాధనలు, పూజలైనా నిష్ఫలం, నిష్ప్రయోజనం. అటువంటి వాటిని భగవంతుడు అంగీకరించడు. అదేవిధంగా కొందరు తమ బలహీనతలను చంపుకోలేక, మధ్యమధ్యలో మాల తీసేసి, చల్లగా తమ పని ముగించుకుని మళ్లీ మాల వేసుకుని భజనలు చేస్తుంటారు. అటువంటివాటిని కనిపెట్టే వాడొకడున్నాడన్న వివేకం, చైతన్యం కలిగి ఉండాలి. కాబట్టి మాల వేసుకోగానే సరిపోదు, ఆయా నియమనిష్ఠలను పాటించగల ఓర్పు, ఇంద్రియనిగ్రహం ఉండేలా చూసుకోవడం అవసరం.

అంతటా ఆరోగ్యమే

అయ్యప్పదీక్షలోని ప్రతి ఒక్క నియమమూ ఆరోగ్యాన్ని కాపాడే అమృతోపకరణమే. చన్నీటి స్నానం ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. మెడలో ధరించే తులసి లేదా రుద్రాక్ష మాల రక్తపోటు, మధుమేహం, చిన్న చిన్న మానసిక, శారీరక రుగ్మతలను దూరం చేయడానికి ఉపకరిస్తుంది. ఆహార నియమం కోరికలను దూరం చేసి, మనోనిశ్చలతనిస్తుంది. జీర్ణకోశాన్ని శుభ్రంగా ఉంచుతుంది. పాదరక్షలను ధరించకుండా తిరగడం వల్ల భక్తులకు కష్టాలను ఓర్చుకునే శక్తి కలుగుతుంది. పాదాల కింద చర్మం మొద్దుబారి అడవులలో సునాయాసంగా నడిచే వీలుంటుంది. నరదృష్టి దోషాన్ని హరించే శక్తినివ్వడంతోబాటు రంగురంగుల దుస్తులపై మమకారం ఉండకుండా చేసేందుకే నల్లదుస్తుల నియమం. విభూతి, గంధం ధరించడం వల్ల చక్కటి వర్చస్సు, ధైర్యం, బలం కలగడంతోబాటు వాత, పిత్త, కఫరోగాలు దరి చేరకుండా ఉంటాయి. వెన్నెముక గట్టిపడి, వెన్నుపూస జారడం, వీపు నొప్పి వంటి రుగ్మతలు లేకుండా చేసేందుకే భూశయనం. బ్రహ్మచర్య దీక్ష దంపతుల మధ్య అనురాగాన్ని పెంచుతుంది. ఈ నలభై ఒక్కరోజుల దీక్షలో సమయపాలన, ఏకాగ్రత, స్థిరచిత్తం, భగవంతుని మీద దృఢమైన భక్తి విశ్వాసాలు, నిరాడంబరత, మృదుభాషణ వంటి మంచి లక్షణాలు అలవడతాయి. కాబట్టి అయ్యప్పదీక్షను సరైన పద్ధతిలో భక్తిశ్రద్ధలతో పాటించిన చేసిన వారి ముఖం, శరీరం, మనస్సు ఒక విధమైన కాంతితో, తేజస్సుతో నిండి ఉండటం గమనించవచ్చు.

ఉల్లంఘించడం మహాపచారం

అయ్యప్పమాల ధరించిన వారు దీక్షాసమయంలో పితృదేవతలకు శ్రాద్ధకర్మలు నిర్వర్తించరాదన్న అపోహ ఒకటి వ్యాప్తిలో ఉంది. అది సరికాదు. పితృకార్యమనేది తప్పనిసరిగా నిర్వర్తించవలసిన నైమిత్తిక కర్మ. అటువంటి వాటిని దీక్షలో ఉన్నామనో, పిల్లల పెళ్లి చేశామనే మరో వంకతోనో ఉల్లంఘించడం మహా అపచారం. వాస్తవానికి దీక్షాసమయంలో ఆ విధమైన కార్యాలను నిర్వర్తించిన వారి పితృదేవతలు తరించడమే కాదు, కర్తకు కూడా శుభకరమన్నది పండితాభిప్రాయం.

పదునెట్టాంబడి

శ్రీ అయ్యప్పస్వామి వారి పద్దెనిమిది మెట్లను ‘పదునెట్టాంబడి’ అంటారు. ఈ పదునెనిమిది మెట్లలో ఒక్కో మెట్టుకూ ఒక్కో అధిష్ఠాన దేవత ఉంటుంది. ఎనిమిది మంది దిక్పాలకులు, నాలుగు వేదాలు, రెండు శాస్త్రాలు, అవిద్య, విద్య, జ్ఞానం, అజ్ఞానం అన్నీ కలిపి మొత్తం పద్దెనిమిది మెట్లుగా ఇక్కడ ఉన్నాయి. వీటన్నింటినీ దాటుకుని వెళితేనే కదా! జ్ఞానస్వరూపుడు, తేజోమూర్తి అయిన అయ్యప్ప స్వామి ముగ్ధమనోహర రూపాన్ని కన్నులారా చూడగలిగేది!!

ఆ నామమే అద్భుత పారవశ్యం

హరిని కొలిచేవారికి, హరుని సేవించేవారికీ పవిత్ర కోవెల శబరిమల. రాగద్వేషాలు, పేద, గొప్ప తేడాలు ఇక్కడ కానరావు. ఎవరి నోట విన్నా అదే దివ్యనామం, ఎవరి ముఖంలో చూసినా అదే భక్తి పారవశ్యం … సత్యం, శౌచం, శాంతం, సహనాలనే ఆభరణాలను ధరించి నలభై రోజులు దీక్ష వహించి, అడవిమార్గాన నడచి వచ్చిన ఆయాసాన్ని, ఆకలి దప్పులను మరచి కొండలు ప్రతిధ్వనించేలా ‘ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప’ అనే తారక మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ అద్భుత రూపుని దర్శించుకుని అనిర్వచనీయమైన ఆనందానుభూతులలో తేలియాడతారు.

#Ayyappa Deeksha, #Ayyappa Deeksha Rules, #Ayyappa Deeksha Significance, #Ayyappa Swamy, #Ayyappa Vratham, #Hindu Devotional, #Manikanta, #Sabarimala, #Sabarimala Temple, #secrets of ayyappa, #Swamiye Saranam Ayyappa