ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా దేశానికి కొత్త నినాదాన్ని ఇచ్చారు. “మనం సాధిస్తాం.. We will do it” అంటూ ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’లో మోదీ ప్రసంగించారు.

2001 అక్టోబర్ 7న మోదీ తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి గుజరాత్ సీఎంగా, ఆ తర్వాత భారత ప్రధానిగా నిరంతరం ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్నారు. దీంతో ప్రభుత్వాధినేతగా ఆయన 25 ఏళ్ల నిరంతర ప్రస్థానాన్ని పూర్తి చేశారు.

ఈ సందర్భంగా తన రాజకీయ ప్రయాణాన్ని వ్యక్తిగత విజయంగా కాకుండా ప్రజల ఆశీర్వాదంగా మోదీ అభివర్ణించారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన బీజేపీ కార్యకర్తలు, ఎన్డీయే భాగస్వాములు, సహచరులు, ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు. తన విమర్శకులు కూడా తనను మరింతగా ఆత్మపరిశీలన చేసుకునేలా చేశారని పేర్కొన్నారు.

25 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూనే మోదీ భవిష్యత్తు లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం, ప్రపంచంలోని టాప్-3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ను నిలపడం, ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించడం, ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగడం, భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించడం, అంతరిక్ష రంగంలో మరింత ముందుకు వెళ్లడం వంటి లక్ష్యాలను ఆయన ప్రస్తావించారు.

“2047లో వికసిత్ భారత్.. మనం సాధిస్తాం. టాప్-3 ఎకానమీ.. మనం సాధిస్తాం. ఆత్మనిర్భర్ భారత్.. మనం సాధిస్తాం. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్.. మనం సాధిస్తాం. ఒలింపిక్స్‌కు ఆతిథ్యం.. మనం సాధిస్తాం. అంతరిక్షంలో మరింత ముందుకు.. మనం సాధిస్తాం” అంటూ మోదీ వరుసగా నినాదాలు చేశారు. ప్రతిసారి సభలోని ప్రజలు కూడా “We will do it” అంటూ స్పందించారు.

దేశ అభివృద్ధికి విధానాలతో పాటు నిరంతర కృషి అవసరమని మోదీ అన్నారు. భారత్‌కు ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, 140 కోట్ల మంది ప్రజలే ఆ సవాళ్లకు పరిష్కారాలని పేర్కొన్నారు. రైతు పొలానికి నీరు లేకపోవడం, విద్యుత్ లేకపోవడం వంటి సమస్యలు ఏ ఒక్క కులం లేదా వర్గానికి మాత్రమే సంబంధించినవి కావని, సమస్య అందరిదైతే పరిష్కారం కూడా అందరి భాగస్వామ్యంతోనే రావాలని చెప్పారు.

భారత్‌లో యువతే దేశ భవిష్యత్తుకు ప్రధాన శక్తి అని మోదీ పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచంలో మరింత కీలక పాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందని, దేశ లక్ష్యాలను సాధించేందుకు ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

#Atmanirbhar Bharat, #Developed India 2047, #Modi 25 Years Governance, #Narendra Modi, #PM Modi, #PM Modi 25 Years, #PM Modi New Slogan, #Top 3 Economy, #Viksit Bharat 2047, #We Will Do It