భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ జీవితకథ ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ ‘దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ ఫస్ట్ లుక్ విడుదలైంది. గంగూలీ 54వ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో నటుడు రాజ్‌కుమార్ రావు, 2002లో లార్డ్స్ మైదానంలో గంగూలీ చేసిన చారిత్రాత్మక జెర్సీ ఊపిన సంబరాన్ని అచ్చం అలాగే పునఃసృష్టించాడు.

పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్న గంగూలీ, “ఇదే నాకు లభించిన అత్యుత్తమ బహుమతి. నా కవర్ డ్రైవ్‌ను నువ్వు తెరపై ఎలా ఆవిష్కరిస్తావో చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ రాజ్‌కుమార్ రావుకు శుభాకాంక్షలు తెలిపాడు.

చరిత్రలో నిలిచిపోయిన ఆ క్షణం

2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై భారత్ అద్భుత విజయం సాధించిన తర్వాత, అప్పటి కెప్టెన్ గంగూలీ లార్డ్స్ బాల్కనీలో తన భారత జెర్సీని తీసి గాల్లో ఊపుతూ సంబరాలు జరుపుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో అది అత్యంత గుర్తుండిపోయే దృశ్యాల్లో ఒకటిగా నిలిచింది. ఆ సన్నివేశాన్నే ఇప్పుడు సినిమాలో రాజ్‌కుమార్ రావు ఫస్ట్ లుక్‌లో తిరిగి చూపించారు.

ఈ చిత్రానికి దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే. గంగూలీ భార్య డోనా గంగూలీ పాత్రలో తాన్యా మాణిక్తలా నటిస్తున్నారు. ఈ సినిమా 2027 మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

#Dada Biopic, #Dada The Sourav Ganguly Story, #First Look, #NatWest Final 2002, #Rajkummar Rao, #Sourav Ganguly, #Sourav Ganguly Biopic, #Vikramaditya Motwane