ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అనుమతి లేకుండా ప్రవేశించారనే ఆరోపణలతో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను ఐదు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. బుధవారం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఈ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వారిని ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. మరో CJP నేత అజింక్య షిండేను వ్యక్తిగత బాండ్‌పై విడుదల చేశారు.
మేజిస్ట్రేట్ మహేశ్ కుమార్ మీనా తన ఉత్తర్వుల్లో గతంలో ఇచ్చిన శాంతిభద్రతల హామీని ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏడాది పాటు శాంతిని కాపాడతామని బాండ్ ఇచ్చిన తర్వాత కూడా, సోషల్ మీడియా ద్వారా నిరసనలకు పిలుపునివ్వడం, జంతర్ మంతర్ వద్ద ప్రజలను సమీకరించేందుకు ప్రయత్నించడం వంటి చర్యలు చేపట్టారని పోలీసుల తరఫున వివరించారు. ఈ నేపథ్యంలో వారిని మరోసారి అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.
అక్టోబర్ 13న CJP నేతలు, కార్యకర్తలు జంతర్ మంతర్ ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. ప్రస్తుతం జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన స్థలంగా గుర్తించడం లేదని, అక్కడికి వెళ్లేందుకు అనుమతి కూడా లేదని పోలీసులు పేర్కొన్నారు. కొందరు కార్యకర్తలు బారికేడ్లు దాటి ప్రాంగణంలోకి ప్రవేశించి, జాతీయ జెండాను ఎగురవేసి నినాదాలు చేశారని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కూడా ఆరోపించారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా ప్రవేశించడం, నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం, శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేయడం, ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించకుండా అడ్డుకోవడం వంటి ఆరోపణలు కేసుల్లో ఉన్నాయి. నిందితులు గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని, విడుదల చేస్తే మళ్లీ చట్టాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందని పోలీసులు మేజిస్ట్రేట్‌కు వివరించారు.
మేజిస్ట్రేట్ ఉత్తర్వుల ప్రకారం, సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 130 కింద నోటీసులు జారీ చేశారు. తగిన పూచీకత్తు సమర్పించనందున, ప్రజా శాంతిని కాపాడేందుకు వారిని ఐదు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని ఆదేశించారు. ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్ 19కు వాయిదా వేశారు. మరో నేత అజింక్య షిండే ఆరు నెలల పాటు శాంతిభద్రతలను కాపాడాలనే షరతుతో వ్యక్తిగత బాండ్‌పై విడుదలయ్యారు.
CJP నేతల అరెస్టులపై ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమే తమ నేతలు చేసిన తప్పా అని ప్రశ్నించారు. నిరసన హక్కును అణచివేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మరోవైపు, చట్టాన్ని ఉల్లంఘించకుండా ఉండాలని గతంలో హామీ ఇచ్చినప్పటికీ దాన్ని ఉల్లంఘించారని, ప్రజా శాంతికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు తమ చర్యలను సమర్థించారు.
