ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు వెళ్లిన ‘కాక్‌రొచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కేను ఢిల్లీ పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన కొద్దిసేపటికే పోలీసులు విమానంలోకి ప్రవేశించి డిప్కేతో పాటు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు జరగాల్సిన నిరసన కార్యక్రమానికి ముందే ఈ ఘటన చోటుచేసుకుంది.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ CJP జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరిగాయని పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో నిరసనలో పాల్గొనేందుకు డిప్కే, ఆయన సహచరులు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, విమానం దిగకముందే పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతో విమానంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులు విమానంలోకి రావడంపై డిప్కే అభ్యంతరం వ్యక్తం చేశారు. “నేను అరెస్టు కావడానికే వచ్చాను.. అరెస్టు చేయండి. నేను మీకు భయపడను” అంటూ పోలీసులతో అన్నారు. విమానం నుంచి ప్రయాణికులు దిగిన తర్వాత కూడా పోలీసులు తమను అదుపులోకి తీసుకోవచ్చని, విమానంలోకి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ ఘటనను ఆయన సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఈ ఘటనపై CJP తీవ్రంగా స్పందించింది. తమ నేతలను విమానంలోనే అదుపులోకి తీసుకోవడాన్ని “అధికార దుర్వినియోగం”గా అభివర్ణించింది. నిరసన స్థలానికి చేరకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ చర్య తీసుకున్నారని ఆరోపించింది. తమ నేతల స్వేచ్ఛగా ప్రయాణించే హక్కును పోలీసులు ఉల్లంఘించారని పేర్కొంటూ, వారిని వెంటనే ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
మరోవైపు, నిరసన నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. రాజధానిలోని పలు ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించడంతో పాటు, రవాణాపై కూడా ఆంక్షలు విధించారు. నిరసనకు అనుమతి ముందుగా తీసుకోలేదని పేర్కొంటూ ఢిల్లీ పోలీసులు గతంలోనే అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ నిరసన కొనసాగిస్తామని CJP నేతలు ప్రకటించారు.
డిప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను విమానం నుంచి తీసుకెళ్లిన తర్వాత ఎక్కడ ఉంచారన్న వివరాలు వెంటనే వెల్లడించలేదు. తమ నాయకులు అదుపులో ఉన్నప్పటికీ నిరసనను కొనసాగిస్తామని CJP ప్రకటించింది. ఈ ఘటనతో ఢిల్లీలో నిరసన హక్కు, పోలీసుల చర్యలు, ప్రజా భద్రత అంశాలపై మరోసారి చర్చ మొదలైంది.
