అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన నాథన్ థామస్ అరుదైన ఘనత సాధించాడు. కేవలం 18 సంవత్సరాల 346 రోజుల వయసులోనే కాలేజ్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన పురుష ప్రొఫెసర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. ఈ విజయంతో 306 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డును అధిగమించాడు.
నాథన్ విద్యా ప్రయాణం చిన్నప్పటి నుంచే అసాధారణంగా సాగింది. కేవలం 10 ఏళ్ల వయసులోనే కాలేజీలో చేరిన ఆయన, 14 ఏళ్లకే అసోసియేట్ డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలను ఆనర్స్‌తో పూర్తి చేశాడు. సాధారణంగా యువత ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వయసులోనే ఆయన బోధనా రంగంలో అడుగుపెట్టడం విశేషం.
2023 ఆగస్టులో మియామి డేడ్ కాలేజీలో ఇంజినీరింగ్ విభాగంలో అధ్యాపకుడిగా చేరిన నాథన్, తన వయసుకు సమానమైన విద్యార్థులకే కంప్యూటింగ్, ప్రోగ్రామింగ్ అంశాలను బోధించడం ప్రారంభించాడు. తరగతి గదిలో వయసు కంటే జ్ఞానం, బోధనా నైపుణ్యమే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డాడు. విద్యార్థులు నేర్చుకోవాలనే ఆసక్తి చూపితే వారికి సహాయం చేయడమే తన లక్ష్యమని చెప్పారు.
ప్రస్తుతం నాథన్ ఆన్‌లైన్‌లో బోధన కొనసాగిస్తూ, అదే సమయంలో న్యాయశాస్త్రంలో (లా) కూడా ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడు. భవిష్యత్తులో మేధో సంపత్తి హక్కులు (Intellectual Property Law), ముఖ్యంగా STEM రంగానికి సంబంధించిన చట్టాలపై నిపుణుడిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన విజయం ప్రపంచవ్యాప్తంగా యువతకు స్ఫూర్తినిస్తుందని, వయసు అనేది ప్రతిభకు అడ్డంకి కాదని నాథన్ పేర్కొన్నాడు.
