అమెరికాలో హెచ్-1బీ, PERM వీసాల దుర్వినియోగంపై ట్రంప్ ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన అతిపెద్ద దర్యాప్తును ప్రారంభించింది. అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటికే పలువురు సంస్థలకు డజన్ల కొద్దీ సమన్లు జారీ చేశారు.
ఈ దర్యాప్తులో టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే, కాగ్నిజెంట్ తప్పు చేసిందని ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆరోపణలు చేయలేదు. సంస్థపై వచ్చిన సమాచారం, విశిల్బ్లోయర్లు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
అధికారుల ప్రకారం, హెచ్-1బీ వీసాల దుర్వినియోగం, అక్రమ కార్మిక నియామకాలు, మానవ అక్రమ రవాణా, అమెరికా ఉద్యోగాలను విదేశీ కార్మికులతో భర్తీ చేయడం వంటి అంశాలపై విచారణ జరుగుతుంది. ఈ వ్యవహారాల్లో ఏదైనా అక్రమాలు జరిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది.
హెచ్-1బీ వీసా అంటే ఏమిటి?
హెచ్-1బీ అనేది అమెరికాలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ నిపుణులను ఉద్యోగాల్లో నియమించుకోవడానికి ఇచ్చే వర్క్ వీసా. ఈ వీసాను ముఖ్యంగా ఐటీ కంపెనీలు, ఇంజినీరింగ్, వైద్య, పరిశోధన సంస్థలు ఎక్కువగా ఉపయోగిస్తుంటాయి.
