దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. చర్చిలో ప్రార్థనా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా, వెనుక గోడకు వేలాడుతున్న భారీ శిలువ ఒక్కసారిగా ఊడి ఫాదర్ తలపై పడింది. ఈ ప్రమాదంలో ఫాదర్ ప్యాట్రిసియో ఆల్ఫ్రెడో శాంచెజ్ మోలినారి ప్రాణాలు కోల్పోయారు. ప్రార్థనకు హాజరైన భక్తులు చూస్తుండగానే ఈ ఘటన జరగడం తీవ్ర విషాదాన్ని నింపింది.
గ్వాయాక్విల్ నగరంలోని అవర్ లేడీ ఆఫ్ పెర్పెచ్యువల్ హెల్ప్ చర్చిలో ఆయన ఫాదర్ గా సేవలందిస్తున్నారు. అక్టోబర్ 17, శనివారం ఈ ప్రమాదం జరిగినట్లు గ్వాయాక్విల్ ఆర్చ్డియోసిస్ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చర్చి ప్రార్థనల ప్రత్యక్ష ప్రసారంలో రికార్డయ్యాయి. అనంతరం ఆ లైవ్‌స్ట్రీమ్‌ను తొలగించారు.
ఈ ఘటనకు కొద్దిసేపటి ముందే ఫాదర్ మోలినారి జీవితంలోని అనిశ్చితి, మరణం గురించి భక్తులకు ఉపన్యాసం ఇచ్చారు. మనిషి జీవితం శాశ్వతం కాదని, అందువల్ల సమయాన్ని వృథా చేయకుండా దేవుడితో, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలని సూచించారు. ముఖ్యంగా ఫోన్లలో ఎక్కువసేపు గడపడం కంటే జీవితంలో ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.
ఉపన్యాసం అనంతరం భక్తుల కోసం ప్రార్థన చేస్తుండగా ఆయన వెనుక ఉన్న భారీ శిలువ అకస్మాత్తుగా గోడ నుంచి ఊడి ముందుకు పడింది. అది పూజారి తల వెనుక భాగాన్ని బలంగా తాకింది. దెబ్బ తగిలిన వెంటనే ఆయన నేలపై పడిపోయారు. భక్తులు భయంతో కేకలు వేస్తూ ఆయనకు సహాయం చేసేందుకు పరుగెత్తారు. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు.
సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పటికీ, అదే రోజు ఆయన మరణించినట్లు అధికారులు తెలిపారు. శిలువ గోడ నుంచి ఎందుకు ఊడిపోయిందన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ప్రమాదానికి గల కారణాలపై చర్చి అధికారులు బహిరంగంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
ఫాదర్ మోలినారి మరణవార్తతో గ్వాయాక్విల్ ఆర్చ్డియోసిస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చర్చికి, భక్తులకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ సంతాపం ప్రకటించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ప్రత్యేక స్మారక దివ్యబలి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
