ఢిల్లీలో అక్టోబర్ 10న జరగనున్న నిరసన కార్యక్రమంపై విధించిన ఆంక్షలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసన తెలిపే హక్కుతో పాటు సాధారణ ప్రజలకు రవాణా, ఇతర అత్యవసర సేవలు అందుబాటులో ఉండే హక్కును కూడా కాపాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ అంశంపై అక్టోబర్ 9న మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టింది.

చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు పౌరులకు ఉందని, అయితే ప్రజా భద్రత, శాంతిభద్రతలను కాపాడేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. కానీ ఆంక్షలు అవసరమైన పరిమితుల్లోనే ఉండాలని, వాటి పేరుతో ప్రజల సాధారణ జీవనాన్ని పూర్తిగా స్తంభింపజేయకూడదని అభిప్రాయపడింది.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్‌రొచ్ జనతా పార్టీ’ (CJP) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. అయితే ఈ కార్యక్రమానికి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. నిరసనకు సంబంధించిన దరఖాస్తు ఆలస్యంగా సమర్పించడంతో పాటు గతంలో విధించిన నిబంధనలు ఉల్లంఘించారనే కారణాలను పోలీసులు ప్రస్తావించారు.

నిరసనకు ముందు ఢిల్లీలోని 57 మెట్రో స్టేషన్లను మూసివేయడం, కొన్ని రైళ్లను రద్దు చేయడం వంటి చర్యలపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఆంక్షల వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, రోగులు సహా వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. శాంతిభద్రతలు, ప్రజా భద్రతను కాపాడేందుకే ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, నిరసనకారులను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవచ్చని, అయితే మెట్రో రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేయడం వంటి చర్యలు సముచితంగా ఉండాలని సూచించింది. రైళ్లను పూర్తిగా ఆపకుండా వాటి రాకపోకల వ్యవధిని నియంత్రించే మార్గాలను పరిశీలించాలని పేర్కొంది.

నిరసనకారుల హక్కులను కాపాడటంతో పాటు సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరసనలో పాల్గొనేవారి సంఖ్యను పరిమితం చేయడం, వారు ఆయుధాలు లేకుండా శాంతియుతంగా కార్యక్రమం నిర్వహించేలా చూడటం వంటి మార్గాలను పరిశీలించవచ్చని తెలిపింది. ప్రజా రవాణా, రోజువారీ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోకుండా అధికారులు తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.

#Chief Election Commissioner, #CJP Protest, #Delhi Metro Closure, #Delhi Metro Stations, #Delhi Protest, #Delhi Protest Restrictions, #Gyanesh Kumar, #Jantar Mantar Protest, #Supreme Court, #Supreme Court Delhi Protest