ఓపెన్‌ఏఐ ప్రస్తుతం భారీ స్థాయిలో దర్యాప్తు చేపడుతోంది. సంస్థకు చెందిన AI ఏజెంట్లు ఇంటర్నెట్‌లో గతంలో ఏం చేశాయో తెలుసుకునేందుకు రోజుకు 5 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోంది. ఈ దర్యాప్తులో దాదాపు 50 పెటాబైట్ల డేటాను పరిశీలిస్తోంది. ఈ మొత్తం సమాచారాన్ని సాధారణ ఇంగ్లిష్ టెక్స్ట్‌గా మార్చితే.. ఒక మనిషి నిమిషానికి 240 పదాల వేగంతో, ఎలాంటి విరామం లేకుండా చదవడానికి సుమారు 6.6 కోట్ల సంవత్సరాలు పడుతుందని ఓపెన్‌ఏఐ తెలిపింది.

ఓపెన్‌ఏఐ AI ఏజెంట్లకు సంబంధించిన పలు అనూహ్య ఘటనలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ భారీ సమీక్షను ప్రారంభించింది. ముఖ్యంగా AI ప్లాట్‌ఫామ్ ‘హగ్గింగ్ ఫేస్’పై జరిగిన ఘటనతో పాటు ఆస్ట్రేలియా ప్రభుత్వ వెబ్‌సైట్లలో అనుమతి లేని కార్యకలాపాలు జరిగినట్లు గుర్తించారు. ఇప్పటివరకు 100కు పైగా సంస్థలకు తమ AI సిస్టమ్‌లకు సంబంధించిన కార్యకలాపాల గురించి ఓపెన్‌ఏఐ సమాచారం అందించింది. అయితే నోటీసు అందుకున్నంత మాత్రాన ఆయా సంస్థల ప్రైవేట్ సమాచారం దొంగిలించబడిందని లేదా సిస్టమ్ హ్యాక్ అయిందని అర్థం కాదని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసింది.

ఈ దర్యాప్తులో భాగంగా ఓపెన్‌ఏఐ నెలవారీగా పాత రికార్డులను పరిశీలిస్తోంది. AI మోడల్స్ ఏవైనా వెబ్‌సైట్లను అనుమతి లేకుండా యాక్సెస్ చేశాయా, వాటిలో మార్పులు చేశాయా, పాస్‌వర్డ్లు, APIలు లేదా ఇతర సున్నితమైన క్రెడెన్షియల్స్‌తో అనధికారికంగా వ్యవహరించాయా అనే విషయాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది.

50 పెటాబైట్ల డేటా అంటే దాదాపు 5 కోట్ల గిగాబైట్లకు సమానం. ఇంత భారీ మొత్తంలో సమాచారాన్ని మనుషులు పూర్తిగా పరిశీలించడం సాధ్యం కాకపోవడంతో.. ఓపెన్‌ఏఐ తన AI టెక్నాలజీనే ఉపయోగించి ఈ డేటాను విశ్లేషిస్తోంది. ప్రస్తుతం ఈ దర్యాప్తుకు రోజుకు 5 కోట్ల రూపాయలకుపైగా ఖర్చవుతున్నట్లు సంస్థ తెలిపింది. అవసరాన్ని బట్టి కంప్యూటింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచాలని కూడా ఓపెన్‌ఏఐ భావిస్తోంది.

ఈ పరిస్థితికి కారణం AI ఏజెంట్లకు పెరుగుతున్న స్వయం ప్రతిపత్తి. సాధారణ AI చాట్‌బాట్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా.. AI ఏజెంట్లు వెబ్‌సైట్లను బ్రౌజ్ చేయడం, సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం, బటన్లు క్లిక్ చేయడం, వివిధ పనులను స్వయంగా పూర్తి చేయడం వంటి సామర్థ్యాలను కలిగి ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో లక్ష్యాన్ని సాధించేందుకు మనుషులు ఊహించని మార్గాలను ఎంచుకునే అవకాశం ఉండటం భద్రతా నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఇది ఓపెన్‌ఏఐ AI ఏజెంట్లకు సంబంధించిన మొదటి వివాదం కాదు. జూలైలో జరిగిన హగ్గింగ్ ఫేస్ ఘటనలో వందలాది AI ఏజెంట్లు పరస్పరం కమ్యూనికేట్ చేసుకుని, టెస్టింగ్ వాతావరణంలోని పరిమితులను దాటి ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసినట్లు ఓపెన్‌ఏఐ వెల్లడించింది. ఆ ఘటనలో సుమారు 1,200 ఏజెంట్లు ఒకరితో ఒకరు వేలాది మెసేజ్‌లు, ఫైళ్లను పంచుకున్నట్లు సంస్థ దర్యాప్తులో తేలింది.

ప్రస్తుతం కొనసాగుతున్న ఈ దర్యాప్తులో మరిన్ని ఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఓపెన్‌ఏఐ తెలిపింది. కొన్ని నెలల క్రితం జరిగిన కార్యకలాపాలకు సంబంధించి కూడా సంస్థలు, ప్రభుత్వ విభాగాలను సంప్రదించాల్సి రావచ్చని పేర్కొంది.

#50 Petabytes Data, #AI Agent Mess, #AI Agents, #OpenAI, #OpenAI AI Agents, #OpenAI Investigation, #OpenAI Rogue AI