హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా అనూప్ బాగ్చీ నియమితులయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 1న ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. అక్టోబర్ 27, 2026 నుంచి ఆయన మూడేళ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ, సీఈవోగా ఉన్న శశిధర్ జగదీశన్ పదవీకాలం అక్టోబర్ 26తో ముగియనుంది. ఆయన మరోసారి పదవిలో కొనసాగేందుకు ఆసక్తి చూపకపోవడంతో బాగ్చీని కొత్త సీఈవోగా ఎంపిక చేశారు.

అనూప్ బాగ్చీకి బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్లు, ఇన్సూరెన్స్ రంగాల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ముఖ్యంగా ఆయన కెరీర్‌లో ఎక్కువ కాలం ఐసీఐసీఐ గ్రూప్‌లోనే పనిచేశారు. రిటైల్ బ్యాంకింగ్, హోల్‌సేల్ బ్యాంకింగ్, ట్రెజరీ, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, క్యాపిటల్ మార్కెట్లు, ఇన్సూరెన్స్ వంటి విభాగాల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు.

బాగ్చీ 1990లో ఐఐటీ కాన్పూర్ నుంచి కెమికల్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఐఐఎం బెంగళూరు నుంచి మేనేజ్‌మెంట్ డిగ్రీ పొందారు. 1992లో ఐసీఐసీఐ గ్రూప్‌లో చేరిన ఆయన మూడు దశాబ్దాల కెరీర్‌లో అనేక కీలక పదవులు చేపట్టారు.

ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌కు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కూడా బాగ్చీ పనిచేశారు. అనంతరం ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2017 నుంచి 2023 వరకు ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేసిన సమయంలో తొలుత రిటైల్, బిజినెస్, రూరల్ బ్యాంకింగ్ విభాగాలను పర్యవేక్షించారు. ఆ తర్వాత హోల్‌సేల్ బ్యాంకింగ్ బాధ్యతలు చేపట్టారు.

ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేసిన సమయంలో రిటైల్ మార్ట్గేజ్ పోర్ట్‌ఫోలియో రూ.2 లక్షల కోట్లను దాటిన సమయంలో బాగ్చీ కీలక బాధ్యతల్లో ఉన్నారు. క్రెడిట్ పాలసీ, మార్కెట్లు, డేటా అనలిటిక్స్, టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సేవలు వంటి విభాగాల్లోనూ ఆయనకు అనుభవం ఉంది.

2023 జూన్‌లో బాగ్చీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. FY2025లో ఆయన నేతృత్వంలో సంస్థ Annualised Premium Equivalent (APE) తొలిసారిగా రూ.10,000 కోట్లను దాటింది. APE 15 శాతం పెరిగి రూ.10,407 కోట్లకు చేరగా, పన్నుల తర్వాత లాభం దాదాపు 40 శాతం పెరిగి రూ.1,189 కోట్లుగా నమోదైంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డు అక్టోబర్ 2 నుంచి బాగ్చీని అదనపు డైరెక్టర్‌గా కూడా నియమించింది. అయితే ఈ నియామకానికి షేర్‌హోల్డర్ల ఆమోదం అవసరం. అక్టోబర్ 27 నుంచి ఆయన అధికారికంగా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.

#Anup Bagchi, #Anup Bagchi Profile, #HDFC Bank, #HDFC Bank CEO, #HDFC Bank MD, #HDFC Bank New CEO, #ICICI Group, #RBI Approval, #Sashidhar Jagdishan