యూపీఐ చెల్లింపులకు సంబంధించి అక్టోబర్ 15 నుంచి కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని యూపీఐ Merchant Paymentsపై 0.4 శాతం Merchant Discount Rate (MDR) వర్తించనుంది. అయితే ఈ ఛార్జీని వినియోగదారుల నుంచి వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మార్పుల నేపథ్యంలో యూపీఐ వినియోగదారులు పెద్ద మొత్తంలో చెల్లింపుల కోసం క్యాష్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ల వైపు మారే అవకాశం ఉందని LocalCircles సర్వే వెల్లడించింది. 67,000కుపైగా యూపీఐ వినియోగదారుల నుంచి సేకరించిన వివరాల్లో ఈ విషయం బయటపడింది.
వ్యాపారి అదనపు ఛార్జీని కస్టమర్‌పై వేస్తే ఏం చేస్తారని అడిగిన ప్రశ్నకు కేవలం 14 శాతం మంది మాత్రమే అదనపు మొత్తాన్ని చెల్లించి యూపీఐనే కొనసాగిస్తామని చెప్పారు. 27 శాతం మంది నగదు చెల్లిస్తామని, 26 శాతం మంది క్రెడిట్ కార్డు ఉపయోగిస్తామని, 14 శాతం మంది డెబిట్ కార్డుకు మారుతామని తెలిపారు. మరో 4 శాతం మంది NEFT లేదా IMPS వంటి బ్యాంక్ ట్రాన్స్ఫర్లను ఎంచుకుంటామని చెప్పారు.
ఇక రూ.2,000 కంటే ఎక్కువ చెల్లింపులకు భవిష్యత్తులో అదనపు ఖర్చు వస్తే తమ ప్రధాన చెల్లింపు విధానం ఏంటని అడిగినప్పుడు 26 శాతం మంది క్రెడిట్ కార్డు, మరో 26 శాతం మంది నగదును ఎంచుకుంటామని చెప్పారు. డెబిట్ కార్డు 13 శాతం, బ్యాంక్ ట్రాన్స్ఫర్లు 11 శాతం కాగా, కేవలం 20 శాతం మంది మాత్రమే యూపీఐనే కొనసాగిస్తామని చెప్పారు. అంటే సర్వేలో పాల్గొన్న వారిలో 76 శాతం మంది పెద్ద మొత్తాల చెల్లింపుల విషయంలో యూపీఐకి దూరమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అక్టోబర్ 15 నుంచి వచ్చే 0.4 శాతం MDR నేరుగా కస్టమర్లపై పడదు. ఇది వ్యాపారులు చెల్లించాల్సిన ఛార్జీ. రూ.2,000 లేదా అంతకంటే తక్కువ విలువైన సాధారణ Merchant UPI Paymentsపై ఈ MDR ఉండదు. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే UPI బదిలీలు కూడా ఉచితంగానే కొనసాగుతాయి.
అన్ని వ్యాపారాలకూ ఇదే నిబంధన ఉండదు. రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం వంటి కొన్ని కేటగిరీలకు రూ.2,000 కంటే ఎక్కువ చెల్లింపులపై ఫ్లాట్‌గా రూ.5 MDR ఉంటుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్, స్టాక్ బ్రోకర్లు వంటి కొన్ని క్యాపిటల్ మార్కెట్ చెల్లింపులకు 0.02 శాతం MDR నిబంధన ఉంది.
చిన్న వ్యాపారులకు కూడా మినహాయింపులు ఉన్నాయి. యూపీఐ QR ద్వారా నెలకు రూ.1 లక్ష వరకు స్వీకరించే అర్హత కలిగిన చిన్న వ్యాపారులకు MDR ఉండదు. అలాగే యుటిలిటీ బిల్లులు, OTT సబ్స్క్రిప్షన్లు, నెలవారీ పెట్టుబడులు వంటి కొన్ని రికరింగ్ చెల్లింపులకు కూడా కొత్త MDR వర్తించదు.
ప్రభుత్వం మాత్రం కస్టమర్లపై ఈ ఛార్జీని మోపకూడదని స్పష్టం చేసింది. యూపీఐ వ్యవస్థలో మౌలిక సదుపాయాలు, సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ, టెక్నాలజీ నిర్వహణ వంటి ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించేందుకు కొత్త MDR విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ నిబంధనలు అక్టోబర్ 15, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.
