భారత మాజీ క్రికెటర్, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి హత్య బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. గంగూలీతో పాటు ఆయన భార్య డోనా గంగూలీకి కూడా పలుమార్లు బెదిరింపు లేఖలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తాజా లేఖ అందిన నేపథ్యంలో గంగూలీ కుటుంబం కోల్‌కతాలోని ఠాకూర్పుకూర్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన కుటుంబ భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
గంగూలీ కుటుంబం తరఫున ఆయన వ్యక్తిగత సహాయకుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. సోమవారం బెంగాల్ క్రికెట్ అధ్యక్షుడి కార్యాలయంలో తాజా లేఖను తెరిచారు. పూర్తిగా ఇంగ్లిష్‌లో ఉన్న ఆ లేఖలో సౌరవ్ గంగూలీ, ఆయన కుటుంబాన్ని అంతం చేస్తామని తీవ్రమైన బెదిరింపులు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, గత ఆరు నెలలుగా ఇలాంటి లేఖలు వస్తున్నాయి. తొలుత వీటిని గంగూలీని ఇష్టపడని అభిమానులు లేదా వ్యక్తులు పంపిన సాధారణ లేఖలుగా భావించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల వచ్చిన లేఖల్లో బెదిరింపుల తీవ్రత పెరగడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. మొదట వచ్చిన లేఖల్లో గంగూలీపై అభ్యంతరకర, ద్వేషపూరిత వ్యాఖ్యలు మాత్రమే ఉండేవని, తాజాగా వచ్చిన రెండు లేఖల్లో మాత్రం గంగూలీ, ఆయన భార్య డోనా గంగూలీతో పాటు ఆయనతో కలిసి పనిచేసే సిబ్బంది ప్రాణాలకు కూడా ముప్పు ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే దర్యాప్తు చేపట్టి బెదిరింపు లేఖలు పంపుతున్న వ్యక్తిని గుర్తించాలని కుటుంబం కోరింది.
ప్రాథమిక దర్యాప్తులో ఈ లేఖలు గంగూలీ నివాసానికి కొరియర్ ద్వారా పంపినట్లు పోలీసులు గుర్తించారు. ప్యాకెట్‌పై బెల్ఘరియాకు చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి పేరు ఉన్నట్లు సమాచారం. లేఖలో పేర్కొన్న ఫోన్ నంబర్‌ను పోలీసులు పరిశీలించగా, ట్రూకాలర్‌లో కూడా అదే పేరు కనిపించింది. అయితే నిజంగా ఆ వ్యక్తే లేఖలు పంపాడా? లేక మరెవరైనా అతని గుర్తింపును ఉపయోగించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు గంగూలీ వ్యక్తిగత సహాయకుడికి తెలిపారు. గంగూలీ, ఆయన కుటుంబ భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సౌరవ్ గంగూలీకి ఉన్న ప్రజా ప్రాధాన్యత దృష్ట్యా ఆయనకు అదనపు భద్రత అవసరమా అనే అంశాన్ని కూడా రాష్ట్ర భద్రతా విభాగం సమీక్షిస్తోంది.
