ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజిక వర్గానికి బీసీ హోదా కల్పించాలని దశాబ్దాల పాటు పోరాడిన ప్రముఖ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు.

కాకినాడ జిల్లా కిర్లంపూడికి చెందిన ముద్రగడ, 2014లో రాష్ట్ర విభజన అనంతరం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. రాష్ట్ర జనాభాలో సుమారు 15–18 శాతం ఉన్న కాపు సామాజిక వర్గం ఏ ఒక్క రాజకీయ పార్టీకి పూర్తిగా మద్దతు ఇవ్వకపోవడంతో, ఎన్నికల్లో కీలక ప్రభావం చూపే వర్గంగా భావిస్తారు.

అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అనంతరం సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా కాపుల డిమాండ్‌ను పరిశీలిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, రిజర్వేషన్ అంశంలో ఎలాంటి స్పష్టమైన ఫలితం రాకపోవడంతో ముద్రగడ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

తుని ఘటనతో రాజకీయ జీవితంలో మలుపు

2016 జనవరి 31న తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలో ముద్రగడ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కాపు గర్జన’ సభ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు తుని రైల్వే స్టేషన్‌లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలకు నిప్పంటించడం, రైల్వే ఆస్తులు, పోలీస్ స్టేషన్‌పై దాడి చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ముద్రగడ రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపుగా మారింది.

పవన్ కళ్యాణ్‌తో రాజకీయ విభేదాలు

తరువాత కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు వర్గంలో ప్రధాన నాయకుడిగా ఎదగడంతో ముద్రగడ ప్రభావం తగ్గింది. 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్‌ను ఓడిస్తానని ప్రకటించిన ఆయన, అది సాధ్యం కాకపోతే తన పేరును “ముద్రగడ పద్మనాభం” నుంచి “ముద్రగడ పద్మనాభ రెడ్డి”గా మార్చుకుంటానని బహిరంగంగా ప్రకటించారు.

పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో, ఇచ్చిన మాట ప్రకారం ముద్రగడ తన పేరును అధికారికంగా మార్చుకున్నారు.

కుటుంబంలో విభేదాలు

ఎన్నికల సమయంలో ముద్రగడ కుమార్తె క్రాంతి, “పవన్ కళ్యాణ్‌నే కాపు సమాజానికి నాయకుడు” అని బహిరంగంగా వ్యాఖ్యానించడం కుటుంబంలో తీవ్ర విభేదాలకు దారితీసింది. ఆగ్రహించిన ముద్రగడ, తన మరణానంతరం కూడా కుమార్తె తనను చూడవద్దని ప్రకటించారు. ఆయన మరణం తర్వాత కిర్లంపూడిలో నివాళులర్పించేందుకు వచ్చిన క్రాంతికి కొందరు “గో బ్యాక్” అంటూ నిరసన వ్యక్తం చేశారు.

నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం

ముద్రగడ 1978లో జనతా పార్టీ తరఫున ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ తరఫున 1983, 1985లో, కాంగ్రెస్ తరఫున 1989లో విజయం సాధించి మొత్తం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు.

ఎన్.టి.రామారావు తొలి మంత్రివర్గంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. 1999 నుంచి 2004 వరకు కాకినాడ లోక్‌సభ సభ్యుడిగానూ సేవలందించారు. ఆయన తండ్రి వీరరాఘవరావు కూడా ప్రత్తిపాడు నుంచి రెండుసార్లు స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

#Andhra Pradesh Politics, #Jana Sena, #Kapu Movement, #Kapu Reservation, #Mudragada Biography, #Mudragada Padmanabham, #Mudragada Padmanabham Death, #Pawan Kalyan, #Tuni Incident