ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జూలై చివరి నాటికి ప్రారంభం కానుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని దేశానికి అంకితం చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ప్రధాని షెడ్యూల్‌కు అనుగుణంగా ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేస్తామని వెల్లడించారు.

మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, విమానాశ్రయ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. అవసరమైన అన్ని భద్రతా, సాంకేతిక అనుమతుల ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుంది. ప్రారంభోత్సవం అనంతరం త్వరలోనే వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.

భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కావడంతో ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ స్థాయి విమాన అనుసంధానం లభించనుంది. దీంతో పర్యాటకం, పరిశ్రమలు, ఐటీ, వ్యాపార రంగాలతో పాటు ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం నుంచి నడుస్తున్న పౌర విమాన సర్వీసులు కొత్త భోగాపురం విమానాశ్రయానికి తరలించే ప్రక్రియ కూడా చేపట్టనున్నారు.

#Airport Inauguration, #Andhra Pradesh Airport, #Bhogapuram Airport, #Bhogapuram International Airport, #Civil Aviation, #Kinjarapu Ram Mohan Naidu, #North Andhra, #PM Modi, #Vizag Airport