భారత్ సరిహద్దుకు సమీపంలో టిబెట్లో బ్రహ్మపుత్ర నది (యార్లుంగ్ సాంగ్పో)పై చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుకు తీవ్రమైన భౌగోళిక ముప్పు ఉందని చైనా శాస్త్రవేత్తలే హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం హిమాలయాల్లో అత్యంత భూకంపాలకు గురయ్యే ప్రాంతాల్లో ఒకటిగా గుర్తించబడిందని ప్రభుత్వ మద్దతుతో జరిగిన అధ్యయనం వెల్లడించింది.
‘మెడోగ్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్’గా పిలిచే ఈ భారీ డ్యామ్ కిందుగా ‘పైజెన్ యాక్టివ్ ఫాల్ట్ లైన్’ (Paizhen Active Fault) వెళ్తోందని పరిశోధకులు గుర్తించారు. ఈ ఫాల్ట్ లైన్ ఇప్పటికీ చురుకుగా ఉండటంతో భవిష్యత్తులో భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం, నేల కుంగిపోవడం వంటి ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.
పరిశోధకుల ప్రకారం, ఫాల్ట్ లైన్ చుట్టూ ఉన్న రాతి పొరలు ఇప్పటికే పగుళ్లతో బలహీనపడిపోయాయి. దీంతో డ్యామ్తో పాటు రిజర్వాయర్ పరిసరాల్లో నిర్మించే సొరంగాలు, వంతెనలు, రహదారులు వంటి మౌలిక సదుపాయాల స్థిరత్వం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల నిర్మాణంలో అదనపు భద్రతా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
సుమారు 137 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రంగా నిలవనుంది. అయితే ఈ నది భారతదేశంలో బ్రహ్మపుత్రగా, బంగ్లాదేశ్లో జమునాగా ప్రవహిస్తుండటంతో, ప్రాజెక్టు భద్రతతో పాటు దిగువన ఉన్న దేశాలపై దీని ప్రభావం కూడా ఆందోళన కలిగిస్తోంది.
