తమిళ స్టార్ విజయ్ నటించిన తాజా చిత్రం ‘జన నాయకన్’ విడుదలకు ముందే విదేశాల్లో సంచలనం సృష్టిస్తోంది. భారత్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాకముందే యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో టికెట్ల అమ్మకాలు జోరందుకున్నాయి. కెనడాలో అయితే అభిమానుల ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని టికెట్ల విక్రయాన్ని ప్రత్యేక దశల్లో నిర్వహిస్తున్నారు.

కెనడాలో చిత్రాన్ని విడుదల చేస్తున్న యార్క్ సినిమాస్ కీలక ప్రకటన చేసింది. తొలి 24 గంటల పాటు VIP సభ్యులకు మాత్రమే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. గతంలో టికెట్లు కొనుగోలు చేసి, రీఫండ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. టికెట్ మార్పిడి కూడా థియేటర్ బాక్సాఫీస్‌లోనే ప్రత్యక్షంగా జరుగుతుందని స్పష్టం చేసింది.

రెండో, మూడో రోజుల్లో కూడా VIP సభ్యులకే ప్రాధాన్యం కొనసాగనుంది. అనంతరం మాత్రమే సాధారణ ప్రేక్షకులకు బుకింగ్ అవకాశం లభించనుంది. అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఈ విధానం అమలు చేస్తున్నట్లు పంపిణీదారులు తెలిపారు.

ఇక యూకేలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. అక్కడి డిస్ట్రిబ్యూటర్ అహింసా ఎంటర్‌టైన్‌మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం, అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన తొలి 60 నిమిషాల్లోనే వేలాది టికెట్లు అమ్ముడయ్యాయి. చాలా షోలు ఇప్పటికే హౌస్‌ఫుల్ కావడంతో విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.

మరోవైపు, సెన్సార్ అనంతరం చిత్ర నిడివిని మరో 41 సెకన్లు పెంచారు. దీంతో సినిమా మొత్తం నిడివి 3 గంటల 3 నిమిషాల 52 సెకన్లకు చేరింది. యూకేలో మాత్రం ఎలాంటి కత్తిరింపులు లేకుండా పూర్తి వెర్షన్‌ను ప్రదర్శించనున్నట్లు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ‘జన నాయకన్’ను ఓ సినీ వేడుకలా మార్చేందుకు సిద్ధమవుతున్నారు. విడుదలకు ముందే నెలకొన్న ఈ టికెట్ క్రేజ్.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.

#Jana Nayagan, #Jana Nayagan Advance Booking, #Jana Nayagan Canada Booking, #Jana Nayagan UK Booking, #Kollywood, #Overseas Booking, #Tamil Movie, #Thalapathy Vijay, #Vijay