నాని, కయదు లోహర్ జంటగా నటించిన యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ 1940ల నుంచి 1980ల వరకు సాగుతుంది. ‘ప్యారడైజ్’ ప్రాంతంలో నివసించే సవారీలు అనే వర్గానికి అధికారిక గుర్తింపు ఉండదు. వారిని తమ అవసరాలకు ఉపయోగించుకునే శికంజా మాలిక్, అతని కొడుకు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మరోవైపు సవారీలకు గుర్తింపు కోసం సమ్మక్క పోరాడుతూ ఉంటుంది.

సమ్మక్క కుమారుడు జడల్ పాత్రలో నాని కనిపిస్తాడు. చిన్నతనంలో జరిగిన ఓ ఘటన కారణంగా జైలుకు వెళ్లిన జడల్ 14 ఏళ్ల తర్వాత తిరిగి వస్తాడు. తల్లితో దూరంగా ఉండే జడల్.. కొన్ని పరిస్థితుల కారణంగా సవారీల కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. శికంజా మాలిక్‌కి ఎదురు తిరిగి జడల్ ఎలా నిలబడ్డాడు? సవారీలకు గుర్తింపు తీసుకురావడానికి అతను చేసిన పోరాటం ఏంటి? అనేది సినిమాలో చూడాల్సిందే.

సినిమా మొదటి నుంచే యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. జైలు ఫైట్‌తో ప్రారంభమయ్యే కథలో నాని ఎలివేషన్ సీన్స్, మోహన్ బాబు క్రూరమైన పాత్ర, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తిని పెంచేలా ఉండగా.. సెకండాఫ్‌లో జడల్ పోరాటం చుట్టూ కథ ముందుకు సాగుతుంది. క్లైమాక్స్ కూడా కథకు తగిన ముగింపును ఇచ్చేలా ఉందని రివ్యూలో పేర్కొన్నారు.

అయితే కథలో కొత్తదనం కంటే కథనంపైనే దర్శకుడు ఎక్కువగా దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది. గుర్తింపు లేని వర్గం కోసం పోరాటం అనే పాయింట్ గతంలో పలు సినిమాల్లో కనిపించినప్పటికీ, శ్రీకాంత్ ఓదెల ఆ కథను ఆరు చాప్టర్లుగా విభజించి కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. తల్లి-కొడుకు ఎమోషన్ కూడా కథలో కీలకంగా మారుతుంది.

నాని జడల్ పాత్రలో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించాడు. రెండు జడలు, విభిన్నమైన దుస్తులు, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో పాటు యాక్షన్ సన్నివేశాల్లో నాని తన మార్క్ చూపించాడు. పాత్ర కోసం నాని పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. కయదు లోహర్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. సోనాలి కులకర్ణి తల్లి పాత్రలో ఆకట్టుకోగా.. మోహన్ బాబు చాలాకాలం తర్వాత పూర్తి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. రాఘవ్ జుయల్ కూడా విలన్ పాత్రలో మెప్పించాడు. సంపూర్ణేష్ బాబు కామెడీకి భిన్నంగా యాక్షన్ పాత్రలో కొత్తగా కనిపించాడు.

సాంకేతికంగా ‘ది ప్యారడైజ్’కు సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన బలంగా నిలిచాయి. డార్క్ కలర్ ప్యాలెట్‌తో రూపొందించిన విజువల్స్ సినిమాకు ప్రత్యేకమైన వాతావరణాన్ని తీసుకొచ్చాయి. అనిరుధ్ రవిచందర్ BGM యాక్షన్ సన్నివేశాలకు మరింత ఇంపాక్ట్ ఇచ్చింది. ఇప్పటికే పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అయితే సినిమాలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉండటం, కొన్ని చోట్ల లవ్ ట్రాక్ మరియు సెకండాఫ్ కొంత నెమ్మదిగా అనిపించడం మైనస్‌లుగా కనిపిస్తాయి. కుటుంబ ప్రేక్షకులతో, ముఖ్యంగా చిన్నపిల్లలతో కలిసి చూసే సినిమా కాదని తెలుస్తుంది.

మొత్తంగా ‘ది ప్యారడైజ్’లో కథ పాతదే అయినప్పటికీ.. కొత్త ప్రపంచం, నాని సరికొత్త లుక్, హై-వోల్టేజ్ యాక్షన్, మోహన్ బాబు విలనిజం, తల్లి-కొడుకు ఎమోషన్, అనిరుధ్ BGM సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. యాక్షన్, వైలెన్స్ ఎక్కువగా ఉండే సినిమాలను ఇష్టపడే వారికి ‘ది ప్యారడైజ్’ నచ్చే అవకాశం ఉంది.

#Mohan Babu, #Nani Kayadu Lohar, #Nani Movie Review, #Nani The Paradise, #Srikanth Odela, #The Paradise Movie Review, #The Paradise Rating, #The Paradise Review