న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన బ్రిక్స్‌ సదస్సులో అబుదాబి క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ ఖలేద్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 44 ఏళ్ల ఖలేద్‌ ఈ సదస్సు సందర్భంగా ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో కీలక సమావేశాలు నిర్వహించారు. ముఖ్యంగా ఇరాన్‌, యూఏఈ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో పెజెష్కియాన్‌తో ఆయన భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ మాట్లాడుతూ.. అబుదాబి క్రౌన్‌ ప్రిన్స్‌తో మంచి చర్చలు జరిగాయని, గతాన్ని పక్కనపెట్టి భవిష్యత్తు వైపు చూడాలని అంగీకరించినట్లు తెలిపారు. ఈ సమావేశం ఇరాన్‌, యూఏఈ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అత్యంత కీలకమైన దౌత్యపరమైన పరిణామంగా మారింది.

అదే సమయంలో ఖలేద్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీతోనూ సమావేశమయ్యారు. భారత్‌, యూఏఈ మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, ఇంధనం, రక్షణ, అంతరిక్షం, అణుశక్తి, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ వంటి రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించారు. యూఏఈకి చెందిన ఓ సంస్థ ఒడిశాలో 11.5 బిలియన్‌ డాలర్ల విలువైన అల్యూమినియం ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టనున్న విషయాన్ని కూడా ఇరువురు నేతలు ప్రస్తావించారు.

ప్రస్తుతం ఖలేద్‌ అబుదాబి పాలనా వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2023లో యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ తన కుమారుడు ఖలేద్‌ను అబుదాబి క్రౌన్‌ ప్రిన్స్‌గా నియమించారు. అలాగే అబుదాబి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు అప్పగించారు.

అబుదాబి నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ (ADNOC) ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి ఖలేద్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అబుదాబి సార్వభౌమ సంపద, పెట్టుబడులు, ఆర్థిక సంస్థలకు సంబంధించిన వ్యవహారాల్లోనూ ఆయన పాత్ర పెరుగుతోంది. దీంతో యూఏఈ భవిష్యత్‌ ఆర్థిక, దౌత్య విధానాల్లో ఖలేద్‌ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని కథనం పేర్కొంది.

గల్ఫ్‌ ప్రాంతంలో సౌదీ అరేబియా, యూఏఈ మధ్య ఆర్థిక, రాజకీయ ప్రభావం కోసం పోటీ కూడా కొనసాగుతోంది. సౌదీ అరేబియాకు పెద్ద జనాభా, భారీ ఆర్థిక వ్యవస్థ ఉండగా.. యూఏఈ ఆర్థిక, వాణిజ్య, లాజిస్టిక్స్‌, పెట్టుబడుల కేంద్రంగా తన స్థానాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో అబుదాబి ప్రయోజనాలను కాపాడుతూ అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలను నిర్వహించడం ఖలేద్‌కు పెరుగుతున్న బాధ్యతగా మారింది.

సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ మాదిరిగానే గల్ఫ్‌లో కొత్త తరం రాజకుటుంబ సభ్యులు కీలక అధికార బాధ్యతలు చేపడుతున్నారు. అయితే ఖలేద్‌ ఎదుగుదల క్రమంగా సాగుతోందని కథనం పేర్కొంది. యూఏఈ అధ్యక్షుడైన తన తండ్రి నిర్మించిన రాజకీయ, ఆర్థిక వ్యవస్థను భవిష్యత్తులో నిర్వహించే బాధ్యతలు ఆయనపై మరింతగా పెరుగుతున్నాయి.