భారతీయ సినీ పరిశ్రమలో విలక్షణ విలన్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. 74 ఏళ్ల వయసులో రక్త క్యాన్సర్‌తో (బ్లడ్ క్యాన్సర్) కొంతకాలంగా పోరాడిన ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన మేనేజర్ సిద్ధార్థ్ తివారీ అధికారికంగా ధృవీకరించారు.

మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం, నాలుగేళ్ల క్రితం క్యాన్సర్‌ను జయించిన ప్రదీప్ రావత్‌కు దాదాపు నెలన్నర క్రితం మళ్లీ వ్యాధి తిరగబెట్టింది. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ప్లేట్‌లెట్ల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోవడంతో ఆరోగ్యం మరింత విషమించి, వైద్యుల ప్రయత్నాలు ఫలించక ఆయన కన్నుమూశారు.

ప్రదీప్ రావత్ తన సినీ జీవితంలో హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఎన్నో చిత్రాల్లో నటించారు. ‘లగాన్’, ‘గజిని’, ‘సర్ఫరోష్’ వంటి హిందీ చిత్రాలతో పాటు, తెలుగులో ‘సై’, ‘ఛత్రపతి’, ‘స్టాలిన్’, ‘లక్ష్యం’ తదితర చిత్రాల్లో తన విలనిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బి.ఆర్. చోప్రా రూపొందించిన టెలివిజన్ సీరియల్ ‘మహాభారత్’ లో అశ్వత్థామ పాత్ర ద్వారా కూడా ఆయన విశేష గుర్తింపు పొందారు.

ప్రదీప్ రావత్ మృతి వార్త తెలిసిన వెంటనే సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పిస్తూ, భారతీయ సినీ పరిశ్రమ ఓ గొప్ప నటుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

#Actor Pradeep Rawat, #Chatrapathi Villain, #Ghajini Villain, #Lagaan Actor, #Pradeep Rawat, #Pradeep Rawat Blood Cancer, #Pradeep Rawat Death, #Sye Movie Villain