కృత్రిమ మేధ (AI)తో నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. నాణ్యతా తనిఖీల్లో AI ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో, సంస్థ మళ్లీ 300 మందికి పైగా అనుభవజ్ఞులైన ఇంజినీర్లు, క్వాలిటీ ఇన్‌స్పెక్టర్లను తిరిగి నియమించుకుంది.
వ్యయాలను తగ్గించడం, ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా ఫోర్డ్ తన తయారీ ప్రక్రియలోని కొన్ని విభాగాల్లో AIను ప్రవేశపెట్టింది. ఫ్యాక్టరీల్లో వాహనాల నాణ్యతను గుర్తించేందుకు వందలాది AI ఆధారిత కెమెరాలను కూడా ఏర్పాటు చేసింది. అయితే వాస్తవ పరిస్థితుల్లో AI వ్యవస్థలు అనుభవజ్ఞులైన ఇంజినీర్ల నైపుణ్యాన్ని అందుకోలేకపోయాయని సంస్థ అంగీకరించింది.
ఫోర్డ్ వాహన హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం ఉపాధ్యక్షుడు చార్లెస్ పూన్ మాట్లాడుతూ, “AI ఒక అద్భుతమైన సాధనం. కానీ దానికి ఇచ్చే శిక్షణ, సమాచారం ఎంత నాణ్యంగా ఉంటేనే అది అంత సమర్థంగా పనిచేస్తుంది” అని తెలిపారు.
గతంలో తమ వద్ద దశాబ్దాల అనుభవం ఉన్న ఇంజినీర్ల జ్ఞానాన్ని AIకు అందించే విషయంలో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన ఒప్పుకున్నారు. దీంతో ఆటోమేటెడ్ వ్యవస్థలు కీలక లోపాలను గుర్తించడంలో విఫలమయ్యాయని చెప్పారు.
ఈ నేపథ్యంలో తిరిగి నియమించిన సీనియర్ ఇంజినీర్లు ఇప్పుడు AI వ్యవస్థలకు మెరుగైన శిక్షణ ఇవ్వడంతో పాటు యువ ఇంజినీర్లకు మార్గదర్శకత్వం కూడా అందిస్తున్నారు. అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం రెండూ కలిసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని ఫోర్డ్ భావిస్తోంది.
ఇదిలా ఉండగా, ఇటీవల విడుదలైన అమెరికా JD Power Initial Quality Studyలో ఫోర్డ్ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 2010 తర్వాత ఈ గౌరవాన్ని తిరిగి సాధించిన సంస్థగా నిలిచింది. ఈ విజయానికి నాయకత్వంలో మార్పులతో పాటు అనుభవజ్ఞులైన ఇంజినీర్లను తిరిగి తీసుకురావడమూ ప్రధాన కారణమని ఫోర్డ్ వెల్లడించింది.
