ఇరాన్ మాజీ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ అంతిమయాత్రకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. రాజధాని టెహ్రాన్ వీధులు శోకసంద్రంగా మారగా, ఇటీవల జరిగిన యుద్ధం ప్రజల మనసుల్లో మిగిల్చిన గాయాలు మాత్రం ఇంకా తాజాగా కనిపించాయి.

యూకేలో నివసిస్తున్న ఓ ఇరానియన్ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి ఖమేనీకి చివరి వీడ్కోలు పలికేందుకు ప్రత్యేకంగా ఇరాన్‌కు చేరుకున్నారు. “ఈ యుద్ధం మమ్మల్ని బలహీనులను చేయలేదు. మరింత ఐక్యంగా, దృఢంగా మార్చింది” అని ఆమె భావోద్వేగంగా చెప్పారు.

ఇటీవల జరిగిన దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ పట్టణంలో కూడా హృదయవిదారక దృశ్యాలు కనిపించాయి. దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు, పౌరుల అంత్యక్రియల్లో వేలాది మంది పాల్గొని నివాళులర్పించారు. చిన్నారుల ఫొటోలతో అలంకరించిన శవపేటికలు చూసి ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు.

టెహ్రాన్‌లో ప్రారంభమైన అంతిమయాత్ర అనంతరం ఖమేనీ భౌతికకాయాన్ని పవిత్ర నగరం ఖోమ్‌కు, అక్కడి నుంచి చివరి అంత్యక్రియల కోసం మష్హద్‌కు తరలించనున్నారు. ఈ కార్యక్రమాల్లో దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, ప్రతినిధులు పాల్గొంటున్నారు.