బెంగళూరులో డేకేర్‌లో పసికందులపై అమానుష వేధింపులు..తల్లిదండ్రులను కలిచివేసిన ఘటన
బెంగళూరులోని క్యాప్‌జెమినీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న ఓ డేకేర్ కేంద్రంలో 2–3 ఏళ్ల చిన్నారులను అత్యంత దారుణంగా వేధించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో పిల్లలను వాషింగ్ మెషీన్ డ్రమ్‌లో కూర్చోబెట్టడం, బాత్రూమ్లో బంధించడం, టాయిలెట్ జెట్‌తో నీరు చల్లడం వంటి అమానుష చర్యలు కనిపించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ఐదుగురు మహిళా కేర్గివర్లపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధిత చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, ఈ వ్యవహారంపై బాలల హక్కుల సంఘం కూడా విచారణ చేపట్టనుంది. సంస్థ కూడా ఘటనపై అంతర్గత దర్యాప్తు ప్రారంభించి, డేకేర్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది.
పిల్లలను చూసుకోవాల్సిన చోటే వారిపై ఇలాంటి అమానుష ప్రవర్తన జరగడం ప్రతి తల్లిదండ్రిని కలచివేసే విషయం. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
