దీపావళికి ముందే దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే గాలి నాణ్యత గణనీయంగా పడిపోయింది. అక్టోబర్ 30న కాస్త మెరుగ్గా ఉన్న గాలి నాణ్యత.. నవంబర్ 3 నాటికి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ పనులు, రోడ్లపై దుమ్ము, చెత్త దహనం వంటి కారణాలతో కాలుష్యం పెరుగుతోంది.
AQI.in గణాంకాల ప్రకారం.. అక్టోబర్ 30న ఢిల్లీలో సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 124గా నమోదైంది. నవంబర్ 2 నాటికి అది 393కు పెరిగింది. నవంబర్ 3న ఉదయం 11:31 గంటల సమయానికి ఏకంగా 464కు చేరుకుంది. దీంతో ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్ర ఆందోళనకరంగా మారింది. కేవలం 96 గంటల్లోనే కాలుష్యం దాదాపు నాలుగు రెట్లు పెరగడం గమనార్హం.
అక్టోబర్ 30న ఢిల్లీలో అత్యల్ప AQI 45గా, అత్యధికం 280గా నమోదైంది. అక్టోబర్ 31 నాటికి సగటు AQI 256కు చేరింది. నవంబర్ 1న 369గా, నవంబర్ 2న 393గా నమోదైంది. నవంబర్ 2న గరిష్ఠ AQI 499కు చేరువైంది. నవంబర్ 3 అర్ధరాత్రి 12:01 గంటలకు కూడా AQI 432గా నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాలుష్యం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు.
అక్టోబర్ చివరిలో కురిసిన వర్షాలు, బలమైన గాలుల కారణంగా ఢిల్లీలో కొంతకాలం గాలి నాణ్యత మెరుగుపడింది. పశ్చిమ దిశ నుంచి వచ్చిన వాతావరణ మార్పులు, తుపాను ‘అర్నాబ్’కు సంబంధించిన వాతావరణ వ్యవస్థలు ఈ వర్షాలకు కారణమయ్యాయి. వర్షం కారణంగా గాలిలోని కాలుష్య కారకాలు కొంతవరకు తొలగిపోగా, బలమైన గాలులు వాటిని చెల్లాచెదురు చేశాయి. అయితే వాతావరణం మళ్లీ పొడిగా మారడంతో వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ పనులు, రోడ్ల దుమ్ము, చెత్తను కాల్చడం వల్ల వెలువడే కాలుష్య కారకాలు గాలిలో పేరుకుపోతున్నాయి.
గాలి కాలుష్యం పెరగడానికి మరో ప్రధాన కారణం వాతావరణంలో గాలి ప్రసరణ సరిగా లేకపోవడం. గాలుల వేగం తగ్గినప్పుడు, భూమికి దగ్గరగా ఉన్న గాలి పైకి వెళ్లి కలిసే ఎత్తు తగ్గినప్పుడు కాలుష్య కారకాలు వాతావరణంలో వ్యాపించకుండా నేల సమీపంలోనే నిలిచిపోతాయి. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున గాలులు బలహీనంగా ఉండటం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. భారత వాతావరణ శాఖ, భూ శాస్త్ర మంత్రిత్వ శాఖకు చెందిన ఐఐటీఎం సంస్థ ఈ పరిస్థితులను గాలి నాణ్యత అంచనాల్లో పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
శీతాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గడం, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు రావడం వల్ల కాలుష్య కారకాలు గాలిలో కలిసిపోయే అవకాశం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో గాలి నాణ్యత క్షీణించడంతో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) రెండో దశను అమల్లోకి తెచ్చింది. రాబోయే రోజుల్లో ఢిల్లీలో గాలి నాణ్యత ‘వెరీ పూర్’ కేటగిరీలోనే ఉండవచ్చని అంచనా. దీనికి తోడు దీపావళి సమయంలో బాణసంచా కాల్చడం వల్ల వెలువడే పొగ, శీతాకాల వాతావరణం కలిసి కాలుష్యాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
