ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో పదో తరగతి విద్యార్థినులపై చైన్‌సాతో దాడి చేసిన కేసులో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై కత్తితో దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు.

21 ఏళ్ల హేమంత్ అలియాస్ దుమ్ము అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో అక్టోబర్ 31న ఇద్దరు పదో తరగతి విద్యార్థినులపై చైన్‌సాతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన తర్వాత అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఆదివారం సాయంత్రం ఆత్మకూరు అటవీ ప్రాంతంలో నిందితుడు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక పోలీసు బృందాలు అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించాయి. ఈ సమయంలో హేమంత్ పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు.

మొదట పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి హెచ్చరించినప్పటికీ నిందితుడు వెనక్కి తగ్గలేదని, ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌పై కత్తితో దాడి చేసి గాయపరిచాడని పోలీసులు వెల్లడించారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం మొత్తం ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హేమంత్ శరీరంలోని కింది భాగంలో బుల్లెట్ గాయాలయ్యాయి.

కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అతడి కాళ్లకు తీవ్రమైన గాయాలు కావడంతో ఒక కాలును తొలగించాల్సిన పరిస్థితి రావచ్చని వైద్య వర్గాల సమాచారం. అయితే దీనిపై వైద్యులు ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు.

మరోవైపు, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన 15 ఏళ్ల విద్యార్థినికి కుడి చేయి పూర్తిగా తెగిపోయింది. ముఖం, మెడతో పాటు శరీరంలోని ఇతర భాగాల్లోనూ తీవ్ర గాయాలయ్యాయి. పలు చోట్ల ఎముకలు విరిగాయి. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక గ్రీన్ కారిడార్ ద్వారా బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు ఆమెకు పలు శస్త్రచికిత్సలు నిర్వహించి ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను అడిగి బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అవసరమైన శస్త్రచికిత్సలు పూర్తయ్యాయని, ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. అయితే తదుపరి 48 గంటలు కీలకమని వైద్యులు చెప్పినట్లు వెల్లడించారు.

దాడి సమయంలో మరో విద్యార్థిని తన స్నేహితురాలిని రక్షించేందుకు ప్రయత్నించగా ఆమె కూడా గాయపడింది. ప్రస్తుతం ఆమెకు కూడా వైద్య చికిత్స అందిస్తున్నారు.

#Anantapur News, #Andhra Crime News, #Andhra Pradesh News, #Chainsaw Attack, #Hemant, #Nara Lokesh, #Police Encounter, #Police Firing, #School Girl Attack