దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. తాజాగా ఈ కేసు దర్యాప్తును సీబీఐలోని సీనియర్ అధికారి సీమా పాహుజాకు అప్పగించింది. ప్రస్తుతం ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ క్రైమ్ యూనిట్‌లో ఎస్పీగా పనిచేస్తున్న సీమా పాహుజా గతంలో పలు కీలకమైన క్రిమినల్ కేసులను దర్యాప్తు చేశారు.
2020 జూన్ 8న ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఓ ఎత్తైన భవనం నుంచి దిశా సాలియన్ కిందపడటంతో మృతి చెందారు. ఆమె వయసు 28 సంవత్సరాలు. దిశా మృతి జరిగిన కొన్ని రోజులకే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా మృతి చెందడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. తొలుత ముంబై పోలీసులు దిశా మృతిని ఆత్మహత్యగా పరిగణించారు. అనంతరం మహారాష్ట్ర సిట్ కూడా దర్యాప్తు చేసి ఎలాంటి అనుమానాస్పద అంశాలు లేవని పేర్కొంది.
అయితే దిశా తండ్రి సతీశ్ సాలియన్ తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని, కేసుకు సంబంధించిన ఆధారాలను తొక్కిపెట్టారని ఆరోపిస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. గతంలో జరిగిన దర్యాప్తులో పలు లోపాలు, అసమానతలు ఉన్నాయని పేర్కొన్న కోర్టు సెప్టెంబర్ 2న సీబీఐతో కొత్తగా దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. అనంతరం సెప్టెంబర్ 13న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో హత్య, సామూహిక అత్యాచారం, నేరపూరిత కుట్ర, ఆధారాలను ధ్వంసం చేయడం, రికార్డులను తారుమారు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎఫ్‌ఐఆర్‌లో పలువురి పేర్లు ఉన్నప్పటికీ, ప్రస్తుతం వారిని నిందితులుగా పేర్కొనలేదని సీబీఐ స్పష్టం చేసింది. దర్యాప్తులో వారి పాత్రకు సంబంధించి ఆధారాలు లభిస్తే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఎఫ్‌ఐఆర్‌లో శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రేతో పాటు ఆయన తండ్రి, మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, నటులు డినో మోరియా, సూరజ్ పంచోలి తదితరుల పేర్లు ఉన్నాయి. వీరి పాత్రలను దర్యాప్తు చేయాల్సి ఉందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే పేర్లు ఉండటం మాత్రమే వారు నిందితులుగా మారినట్లు అర్థం కాదని సీబీఐ స్పష్టం చేసింది.
ఇక సీమా పాహుజా విషయానికి వస్తే.. ఆమె గతంలో హాథ్రాస్ అత్యాచారం-హత్య కేసు, ఉన్నావ్ అత్యాచారం కేసు, కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ అత్యాచారం-హత్య కేసు వంటి పలు హైప్రొఫైల్ కేసుల్లో దర్యాప్తు బృందాల్లో పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ‘గుడియా’ అత్యాచారం-హత్య కేసులోనూ ఆమె దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. 2021లో ఆమెకు బెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌గా గోల్డ్ మెడల్ లభించింది.
దిశా సాలియన్ కేసులో సీబీఐ ఇప్పుడు గతంలో జరిగిన పోలీసు దర్యాప్తు రికార్డులను పరిశీలించడంతో పాటు, అప్పటి దర్యాప్తులో పాల్గొన్న పోలీసు అధికారుల వాంగ్మూలాలను నమోదు చేయనుంది. ఫోరెన్సిక్, పోస్టుమార్టం నివేదికలు, కీలక సాక్షుల వాంగ్మూలాలు, ఘటనాస్థలానికి సంబంధించిన ఆధారాలను కూడా పరిశీలించనుంది.
ఈ తాజా దర్యాప్తుతో 2020లో జరిగిన దిశా సాలియన్ మృతి వెనుక అసలు పరిస్థితులు ఏమిటన్నది మరోసారి సీబీఐ పరిశీలించనుంది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వ్యక్తులపై ఎలాంటి తుది నిర్ధారణకు రావడం సరికాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
