తమిళనాడు పెట్టుబడులను ఆకర్షించే రాష్ట్రాల్లో దేశంలో మూడో స్థానంలో నిలిచినా, రాష్ట్రం నంబర్‌వన్‌గా ఎదగాలంటే కొన్ని కీలక లోపాలను వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ తాజా నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ముందున్న ప్రధాన సవాళ్లను ఇండియా టుడే విశ్లేషించింది.
పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడంలో తమిళనాడు ఇప్పటికే మంచి పేరు సంపాదించింది. బలమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, మెరుగైన రహదారులు, పారిశ్రామిక కారిడార్లు, సమర్థవంతమైన పోర్టులు, విశ్వసనీయ విద్యుత్ సరఫరా, పునరుత్పాదక ఇంధన రంగంలో పురోగతి రాష్ట్రానికి ప్రధాన బలాలుగా నివేదిక పేర్కొంది.
అయితే, చెన్నై విమానాశ్రయం సామర్థ్యం పరిమితంగా ఉండటం, మురుగునీటి శుద్ధి, నిర్వహణలో లోపాలు, కొన్ని పట్టణ సేవల బలహీనతలు, లాజిస్టిక్స్ సమస్యలు రాష్ట్ర పెట్టుబడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయని నీతి ఆయోగ్ గుర్తించింది. ఈ సమస్యలను పరిష్కరిస్తే తమిళనాడు దేశంలో అత్యంత పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా ఎదిగే అవకాశముందని నివేదిక అభిప్రాయపడింది.
మరోవైపు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. తమిళనాడు మొత్తం అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP)లో సుమారు 31 శాతం ఉండటం ఆర్థిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని పేర్కొంది.
ఇటీవల జరిగిన తన తొలి నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం విజయ్ కేంద్రం విడుదల చేయాల్సిన నిధులు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. ఇప్పుడు నీతి ఆయోగ్ సూచించిన లోపాలను ఎంత వేగంగా అధిగమిస్తారనే అంశమే ఆయన పాలనకు తదుపరి పెద్ద పరీక్షగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
