న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పూర్వ ప్రధాన కార్యాలయం 24, అక్బర్ రోడ్ భవనాన్ని 2013 జూన్ 26 నుంచి పార్టీ అనధికారికంగా ఆక్రమించి కొనసాగుతోందని సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ కాలంలో ఆ భవనానికి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి అద్దె చెల్లించలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్టీ చెల్లించాల్సిన బకాయిలు ఎంతన్నది ఇంకా సమీక్షలోనే ఉందని తెలిపింది.
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ ఇచ్చిన RTI సమాధానం ప్రకారం, 24 అక్బర్ రోడ్ బంగ్లాను 1992 ఆగస్టు 7న కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. అయితే, పార్టీకి ఢిల్లీలో కొత్త కార్యాలయం నిర్మించేందుకు స్థలం కేటాయించిన నేపథ్యంలో 2013 జూన్ 26 నుంచి ఆ కేటాయింపును రద్దు చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ ఇప్పటికీ ఆ భవనాన్ని ఉపయోగిస్తోందని పేర్కొన్నారు.
RTI దరఖాస్తుదారు, కాంగ్రెస్‌కు భవనం ఖాళీ చేయాలని ప్రభుత్వం జారీ చేసిన నోటీసుల ప్రతులను కూడా కోరగా, ఆ సమాచారం సమగ్ర రూపంలో అందుబాటులో లేదని, వాటిని సేకరించడం వల్ల శాఖ వనరులపై అధిక భారం పడుతుందని చెబుతూ డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ అందించలేదు.
మరి BJP పూర్వ కార్యాలయం?
అదే RTIలో బీజేపీ మాజీ ప్రధాన కార్యాలయం 11, అశోకా రోడ్ వివరాలు కూడా కోరారు. ఆ భవనం ప్రస్తుతం లోక్‌సభ సభ్యుల పూల్‌లో భాగంగా ఉందని, అద్దె వివరాలకు సంబంధించిన అంశాన్ని లోక్‌సభ సచివాలయానికి బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. బీజేపీకి సంబంధించి ప్రభుత్వం వసూలు చేయాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే అవి కూడా ఇంకా సమీక్షలోనే ఉన్నాయని RTI సమాధానంలో పేర్కొన్నారు.
