అరుదైన జన్యుపరమైన కండరాల వ్యాధి డుచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ (Duchenne Muscular Dystrophy)తో ధైర్యంగా పోరాడిన 17 ఏళ్ల నిరంజన్ ఇక లేడు. కొద్ది రోజుల క్రితమే తన అభిమాన నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిసిన నిరంజన్ బుధవారం కన్నుమూశాడు. ఈ వార్త పవన్ కళ్యాణ్ ను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

నిరంజన్‌కు పవన్ కళ్యాణ్ అంటే అమితమైన అభిమానం. అతని చివరి కోరికను తెలుసుకున్న పవన్..జూన్ 17న హనుమకొండలోని అతని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించడంతో పాటు తిరుపతి ప్రసాదం ఇచ్చారు. నిరంజన్ కోరినట్లే ఒక పెంపుడు కుక్కపిల్లను బహుమతిగా పంపించారు. ఒక ఐప్యాడ్ కూడా కానుకగా ఇచ్చారు. తన రాబోయే చిత్రం OG 2 ప్రత్యేక ప్రదర్శనకు కూడా ఆహ్వానిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ కోరిక నెరవేరకుండానే నిరంజన్ ఈ లోకాన్ని విడిచిపెట్టాడు.

నిరంజన్ మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “కొద్ది రోజుల క్రితం అతని ఇంటికి వెళ్లిన జ్ఞాపకాలు ఇంకా నా కళ్ల ముందే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నా, నన్ను చూసిన వెంటనే అతని ముఖంపై వెలిగిన చిరునవ్వు, జీవితంపై చూపిన ధైర్యం ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత చిన్న వయసులో అలాంటి ధైర్యవంతుడిని కోల్పోవడం ఎంతో బాధాకరం. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి” అని పేర్కొన్నారు.

నటుడు సోనూ సూద్ కూడా నిరంజన్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. “అరుదైన వ్యాధితో పోరాడుతున్నప్పటికీ అతని ముఖంపై చిరునవ్వు ఎప్పుడూ చెరిగిపోలేదు. అతన్ని కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ చిన్నారి చిరునవ్వు ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతుంది. అతని కుటుంబానికి ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే శక్తిని దేవుడు ఇవ్వాలి” అంటూ సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశం పోస్ట్ చేశారు.

#DMD, #Duchenne Muscular Dystrophy, #Niranjan, #OG 2, #Pawan Kalyan, #Pawan Kalyan Fan, #Pawan Kalyan News, #Sonu Sood